శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 18 నవంబరు 2019 (16:38 IST)

ఉత్తర కొరియా: ఒక భార్య, ఇద్దరు భర్తలు, ఆమె జీవితమే ఒక సినిమా

‘అది చాలా అన్యాయం. నాకు పెళ్లయింది. పిల్లలున్నారు. అలాంటిది, నన్ను మరో మగాడికి అమ్మేయడం చాలా తప్పు’. 15ఏళ్ల క్రితం మిసెస్ బి చెప్పిన మాటలివి. మిసెస్ బి (సంక్షిప్త నామం) ఉత్తర కొరియాకు చెందిన మహిళ. పదిహేనేళ్ల క్రితం చైనాలో ఆమెకు ఉపాధి కల్పిస్తానని నమ్మించి ఓ మధ్యవర్తి ఆమెను చైనాకు చెందిన వ్యక్తికి అమ్మేశాడు. అప్పుడామె వయసు 36 ఏళ్లు.

 
ఉత్తర కొరియా నుంచి బయటపడి ఓ ఏడాది పాటు చైనాలో పనిచేసి ఆ డబ్బుతో తిరిగి స్వదేశానికి వెళ్లాలని మిసెస్ బి భావించారు. కానీ, ఆమె ఘోరంగా మోసపోయారు. మరో వ్యక్తికి ‘భార్య’గా మారారు. ‘ఈ వ్యక్తితో ఓ ఏడాది గడుపు. తరువాత పారిపో...’ ఇదీ ఆ మధ్యవర్తి ఆమెకు చెప్పిన మాట. ఆ మహిళ కథను ‘మిసెస్ బి, ఏ నార్త్ కొరియన్ ఉమన్’ పేరుతో సినిమాగా తీశారు. మిసెస్ బి కథలో ట్విస్ట్ ఏంటంటే, తనను కొనుక్కున్న చైనా వ్యక్తిపై ఆమె ఆకర్షణ పెంచుకున్నారు. అతడితో కలిసి పదేళ్లు జీవించారు.

 
కథ అక్కడితో ఆగిపోలేదు. అక్రమ రవాణా బాధితురాలిగా చైనాలో అడుగుపెట్టిన మిసెస్ బి, చివరికి తానే ఒక ‘హ్యూమన్ ట్రాఫికర్’గా మారి ఉత్తర కొరియా యువతులను చైనా పురుషులకు అమ్మడం మొదలుపెట్టారు. అలా ఇప్పటిదాకా 50 మంది మహిళలను చైనాలో అమ్మేసినట్లు ఆమె చెప్పారు. మొదట ఉత్తర కొరియా నుంచి చైనాకు, అక్కడి నుంచి దక్షిణ కొరియాకు మిసెస్ బి చేరుకున్నారు. కానీ, దక్షిణ కొరియా ఎంత స్వేచ్ఛగా ఉన్నా అక్కడ తనకు సంతోషం లేదంటారామె.

 
జీవితమే కథగా సినిమా
చాలా మంది ఉత్తర కొరియా మహిళలు దేశం దాటడానికి ప్రయత్నిస్తూ అక్రమ రవాణా బాధితులుగా మారిపోతారు. చివరికి చైనా పురుషులతో పిల్లల్ని కని అక్కడే స్థిరపడిపోతారు. ఇంకొందరు దక్షిణ కొరియా వెళ్లినా, అక్కడ వాళ్లకు సరైన ఆదరణ దక్కదు. కానీ, వీళ్లలో మిసెస్ బి కథ కాస్త భిన్నం. చైనాలో తనను కొనుక్కున్న వ్యక్తినే ఆమె ఇష్టపడ్డారు. ‘దాన్ని ప్రేమ అని నేను అనలేను. అతడు నన్ను బాగా అర్థం చేసుకున్నాడంతే. అతడు మంచివాడు’ అంటారామె.

 
అతడు తనను కొనుక్కున్నప్పటికీ ఒక ‘భర్త’గా తనపై ప్రేమ చూపించాడని చెబుతారు. చివరికి మిసెస్ బి చైనా నుంచి లావోస్ సరిహద్దు దాటేందుకు అతడే సాయం చేశాడు. ఆమె అక్కడ స్థిరపడ్డాక తనను కూడా తీసుకెళ్తుందని అతడు ఆశించాడు. ‘నేను పిల్లల్ని కనగలనని, కానీ ఉత్తర కొరియాలో నాకు అప్పటికే పిల్లలున్నారని నా చైనా భర్తతో చెప్పా. అతడూ సరేనన్నాడు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అతడు నా వల్లే పిల్లలు లేకుండా ఉండిపోయాడు. కాబట్టి, అతడి చివరి రోజుల్లో నేను, నా పిల్లలు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నా’ అంటారు మిసెస్ బి.

 
సినిమాలో ఏముంది?
నిజానికి మిసెస్ బి, తన ఉత్తర కొరియా భర్తను, పిల్లలను తనతో కలిసి బతకడానికి చైనా తీసుకొచ్చారు. కానీ, ఆ విషయాన్ని సినిమాలో చూపించలేదు. 2009లో ఆమె తన పెద్ద కొడుకును చైనా తీసుకొచ్చారు. అతడు మూడేళ్లు అక్కడే ఉన్నాడు. తరువాత మిసెస్ బి అతడిని దక్షిణ కొరియా పంపించారు.

 
2013లో తన చిన్న కొడుకు, కొరియా భర్తను కూడా మిసెస్ బి దక్షిణ కొరియా పంపించారు. అక్కడికి వెళ్లడానికి ముందు వాళ్లు కూడా మిసెస్ బి, ఆమె చైనా భర్తతో కలిసి చైనాలో కొన్నాళ్లున్నారు. ‘నేనూ, నా చైనీస్ భర్త, నా కొరియన్ భర్త, నా కొడుకు... అందరం ఒకే గదిలో పడుకున్నాం. అది రొమాంటిక్‌గా లేదంటారా’ అంటారు మిసెస్ బి నవ్వుతూ.

 
నేను వాళ్లలో ఒక్కరిని...
‘ఉత్తర కొరియా సరిహద్దు దాటడానికి ప్రయత్నించే 80 శాతం మహిళలు అక్రమ రవాణాకు గురవుతారు. నేనూ వాళ్లలో ఒక్కరిని’ అంటారు మిసెస్ బి. చైనా వెళ్లగానే ఆమె యువతుల అక్రమ రవాణా మొదలుపెట్టలేదు. కొన్నాళ్లు అక్కడ ఓ డైరీ ఫామ్‌లో పనిచేశారు. రెండేళ్లు అక్కడ పనిచేశాక ఓ మధ్యవర్తి సాయంతో తన కొరియా భర్త, కొడుకుకు డబ్బులిచ్చేందుకు మిసెస్ బి వాళ్లను కలిశారు.

 
యువతుల రవాణా మొదలు...
భర్తను కలిశాక అతడి పరిస్థితిని చూసి తాను మహిళలను రవాణా చేయడం మొదలుపెట్టానంటారు మిసెస్ బి. ‘నా భర్త చాలా బలహీనంగా తయరయ్యాడు. వాళ్లను సరిగ్గా చూసుకోవాలంటే మరింత డబ్బు కావాలి. నాకు చైనాలో సరైన పని దొరకలేదు. దాంతో వేరే దారి లేక ఉత్తర కొరియా మహిళలను చైనా పురుషులకు అమ్మడం మొదలుపెట్టా. కానీ, నేను వాళ్లను మోసం చేయలేదు. ముందుగానే వాళ్లను అమ్ముతున్నట్లు ఆ మహిళలకు చెప్పేదాన్ని. దానికి అంగీకరిస్తేనే వారిని చైనా తీసుకొచ్చేదాన్ని.

 
నిజానికి ఆ మహిళలంతా ఏ ఆధారం లేనివారే. అధికారులకు దొరికిపోతే వాళ్లను జైల్లో పెడతారు. అదే చైనాలో ఎవరైనా పురుషుడికి అమ్మేస్తే కనీసం వారి జీవితమైనా భద్రంగా ఉంటుంది. అలా నేను ఓ రకంగా వారికి సాయం చేశాను. వచ్చే డబ్బును చెరి సగం పంచుకునేవాళ్లం’ అంటూ తాను మహిళలను రవాణా చేసిన తీరు గురించి చెబుతారు మిసెస్ బి.

 
2005-10 మధ్య ఆమె దాదాపు 50మంది మహిళలను చైనా పురుషులకు అమ్మేశారు. అలా అమ్మడానికి ముందే ఆ మహిళలు పెట్టే షరతులను మిసెస్ బి ఆ చైనా వ్యక్తులకు వివరించేవారు. నెలనెలా ఉత్తర కొరియాలోని తమ కుటుంబాలకు కొంత డబ్బు పంపాలన్నది వాటిలో ప్రధాన షరతు.

 
‘ఉత్తర కొరియాలో పుట్టినందుకు చాలా మంది ఇలా అక్రమ రవాణాకు గురి కావల్సిందే. నేను చేసింది తప్పని బాధపడట్లేదు. వాళ్లకు ఓ భద్రమైన జీవితాన్ని చూపినందుకు సంతోషిస్తున్నా’ అంటారామె. మహిళలను చైనాకు తరలించడంతో పాటు, వాళ్లను చైనా నుంచి దక్షిణ కొరియా పంపే దళారీగానూ మిసెస్ బి పనిచేశారు. అలా కనీసం ఓ 50మందిని ఆమె దక్షిణ కొరియా పంపారు.

 
‘దక్షిణ కొరియాకు అక్రమంగా తరలిపోవడం అంత సులువు కాదు. బతకడానికి మేం (ఉత్తర కొరియన్లు) ఎందుకు ఇన్ని కష్టాలు పడాలని తలచుకుంటూ కుమిలిపోయేదాన్ని’ అని ఆమె చెబుతారు.

 
మిసెస్ బి సినిమా కోసం నిజ జీవిత దృశ్యాలనే దర్శకుడు జెరో యన్ కెమెరాలో బంధించారు. అందులో ఓ సన్నివేశం కోసం ఓ పాపతో సహా చైనా-లావోస్ సరిహద్దును దాటుతున్న ఓ బృందాన్ని ఆయన చిత్రీకరించారు. కానీ, ఆ సమయంలో ఆ పాప ఏడుపు మొదలుపెట్టింది. ఏడుపు ఆపకపోతే అందరూ పట్టుబడే ప్రమాదం ఉందని, ఆ పాపకు తప్పక మత్తు పదార్థాలు ఇవ్వాల్సి వచ్చినట్లు మిసెస్ బి వివరిస్తారు.

 
ఈ సినిమా చిత్రీకరణ కోసం దర్శకుడు జెరో యన్ కూడా వాళ్లతో కలిసి అక్రమంగానే చైనా లావోస్ సరిహద్దు దాటి అక్కడి నుంచి బ్యాంకక్ చేరుకున్నారు.


కథ సుఖాంతం కాలేదు
మిసెస్ బి 2014లో దక్షిణ కొరియా వచ్చారు. కానీ, తన చైనా భర్తను మాత్రం తీసుకురాలేకపోయారు.
దక్షిణ కొరియా నిఘా అధికారులు మిసెస్ బి ని గూఢచారిగా భావించి విచారించారు. గతంలో ఓసారి చైనాలో ఆమె ‘ఐస్’ అనే ఉత్తరి కొరియా డ్రగ్ అమ్మారు. ఆ డ్రగ్ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు ఉత్తర కొరియా ప్రభుత్వానికి వెళ్లిందని, కాబట్టి ఆమె గూఢచారి అయ్యుండే అవవకాశం ఉందని దక్షిణ కొరియా అధికారులు భావించారు.

 
కానీ మిసెస్ బి దాన్ని ఒప్పుకోరు. దక్షిణ కొరియా ప్రభుత్వం మాత్రం మిసెస్ బి, ఆమె భర్తను ‘నాన్ ప్రొటెక్టడ్’ జాబితాలో చేర్చింది. అంటే వాళ్లకు పునరావాసానికి కావల్సిన డబ్బు, ఇంటి సబ్సిడీ, వృత్తి విద్యలో శిక్షణ లాంటివి అందవు.

 
చైనాలో కనీసం పదేళ్లు జీవించి క్రిమినల్ రికార్డు ఉన్న ఉత్తర కొరియన్లను దక్షిణ కొరియా ‘నాన్ ప్రొటెక్డెడ్’ జాబితాలో చేరుస్తుంది. అక్రమంగా డ్రగ్స్ అమ్మినందుకే మిసెస్ బిను ఆ జాబితాలో చేర్చినట్లు దక్షిణ కొరియా ప్రభుత్వం చెబుతోంది. మిసెస్ బి మాత్రం దక్షిణ కొరియా ప్రభుత్వపై కేసు వేసింది. మరోపక్క, మిసెస్ బి చైనా భర్త మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు.

 
ఇప్పటికీ స్నేహితులే
‘ఇప్పటికీ మేం స్నేహంగా ఉంటాం, మాట్లాడుకుంటాం’ అంటూ ఈ ఇంటర్వ్యూ జరిగిన ఉదయమే తన చైనా భర్త పంపిన ఎస్సెమ్మెస్‌ను మిసెస్ బి చూపించారు. మిసెస్ బి ప్రస్తుతం సోల్‌లో ఓ కాఫీ షాప్‌లో పనిచేస్తున్నారు. డబ్బు కోసం దర్శకుడు యన్ సినిమాలో భాగమైనట్లు ఆమె చెబుతారు.

 
‘ఒకప్పుడు నేను డబ్బుకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేదాన్ని. కానీ, ఇప్పుడు నేనలా ఆలోచించట్లేదు. నేను నా పిల్లల కోసం అన్నీ త్యాగం చేశా. ఇప్పుడు మాత్రం నేను నా సంతోషం కోసమే బతకాలనుకుంటున్నా. ఆ పాత జీవితంతో నాకింక ఏమాత్రం సంబంధం లేదు’ అంటారు మిసెస్ బి.