బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2019 (13:51 IST)

పెళ్లాం ఊరెళ్లింది.. ఈ రోజు రాత్రికి నీవే నా భార్యవు, వచ్చేయ్: విద్యార్థినికి ప్రొఫెసర్ ఫోన్

ఇటీవలి కాలంలో విద్యాబుద్ధులు చెప్పాల్సిన పంతుళ్లే వక్రమార్గంలో ప్రయాణిస్తున్నారు. తమ వద్దకు విద్యాభ్యాసం కోసం వచ్చే విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. లైంగికంగా వేధిస్తున్నారు. మరికొందరు అభంశుభం తెలియని అమ్మాయిల శీలాన్ని దోచుకుంటున్నారు. తాజాగా ఓ ప్రొఫెసర్ తన భార్య ఊరెళ్లిందనీ, తన వద్ద చదువుకునే విద్యార్థినికి ఫోన్ చేసి రాత్రి ఇంటికి రమ్మని పిలిచాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జీబీ పంత్ విశ్వవిద్యాలయంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జీబీ పంత్ విశ్వవిద్యాలయంలో ఓ వ్యక్తి ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. పైగా, ఈయన లేడీస్ హాస్టల్‌కు వార్డెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈయన వివాహితుడు. తన భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లింది. దీంతో రాత్రివేళలో ఒక్కడే ఇంట్లో ఉండలేక పోయాడు. ఏం చేయాలో తోచక.. ఏకంగా తన వద్ద చదువుకునే ఓ విద్యార్థినికి అర్థరాత్రి ఆయన ఫోన్ చేసి... 'ప్రస్థుతం నా భార్య ఇంట్లో లేదు, నీవు వచ్చి వంట చేయి' అంటూ కోరాడు. 
 
దీంతో బిత్తరపోయిన ఆ విద్యార్థిని ప్రొఫెసర్ ఫోన్ కాల్ వ్యవహారాన్ని ఉపకులపతికి ఫిర్యాదు చేసింది. ఫోన్‌ కాల్‌ను డిస్‌కనెక్ట్ చేస్తే, ఫ్రొఫెసరు తనకు టెక్ట్స్ మెసేజ్ కూడా పంపించారని దాన్ని సాక్ష్యంగా వీసీకి విద్యార్థిని సమర్పించిన ఫిర్యాదుతోపాటు జత చేశారు. దీంతోపాటు ప్రొఫెసరు తనకు అర్థరాత్రి తరచూ ఫోన్ కాల్స్ చేశాడని విద్యార్థిని వీసీకి సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది. అయినప్పటికీ వీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బాధిత విద్యార్థిని ఆందోళనకు దిగడంతో వ్యవహారం కాస్త రాష్ట్ర గవర్నర్ దృష్టికి వెళ్లింది. 
 
ఈ వ్యవహారంపై ఆమె సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యుడైన ప్రొఫెసరుపై కఠిన చర్యలు తీసుకోవాలని వీసీని ఆదేశించారు. గవర్నరు ఆదేశాల ప్రకారం ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని వర్శిటీ ప్రొఫెసరును వార్డెన్ పోస్టు నుంచి ఇప్పటికే తొలగించామని పంత్ విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ ఏపీ శర్మ చెప్పారు. యూనివర్శిటీ విద్యార్థినులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామని రిజిష్ట్రార్ వివరించారు.