దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో అనేక రాష్ట్రాలలో ఇప్పటికే ఆక్సిజన్ కొరత తీవ్రమై రోగుల ప్రాణాలు కాపాడడం కష్టమవుతోంది. కరోనా చికిత్సలో అత్యంత కీలకమైన మెడికల్ ఆక్సిజన్ కొరతతో కోవిడ్ రోగులు చనిపోకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. అవసరమైన అన్ని ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి వీలుగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (LMO) తయారీ పెంచాలని, అన్ని పరిశ్రమలనూ ఆదేశించింది.
లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ తయారీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ముందుంది. కరోనా బాధితులను కాపాడటంలో కీలకమైన మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిలో గత ఏడాది ఇది కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు కూడో కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రులకు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచే పెద్ద ఎత్తున ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. గత ఏడాది స్టీల్ ప్లాంట్ నుంచి తెలుగు రాష్ట్రాలు, ఒడిశాకే ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న సమయంలో మిగతా రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి సరఫరా అవుతోంది.
మెడికల్ఆక్సిజన్ అంటే..
కోవిడ్ -19 బాధితుల చికిత్సలో మెడికల్ ఆక్సిజన్ కీలకంగా మారింది. ఆక్సిజన్‌ను ప్రాణవాయువు అంటాం.. అన్నట్లుగానే ఇప్పుడు అది కరోనా సమయంలో రోగుల ప్రాణాలు కాపాడడానికి కీలకం అవుతోంది. అయితే, దీని పారిశ్రామిక అవసరాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని, అందుకే భారీ పరిశ్రమల్లో ఆక్సిజన్ తయారీ యూనిట్లు ఉంటాయని ఇండస్ట్రియల్ పొల్యూషన్ టెస్టింగ్ ల్యాబ్, సీనియర్ కెమిస్ట్ బుద్ధా రవిప్రసాద్ బీబీసీతో చెప్పారు.
"ముఖ్యంగా ఉక్కు, ఇనుము, మందుల తయారీ కంపెనీలలో ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ పరిశ్రమలు సొంతంగా యూనిట్లు పెట్టుకుని తమకు అవసరమైన ఇండస్ట్రియల్ ఆక్సిజన్‌ను తయారు చేసుకుంటాయి. స్టీల్ ప్లాంట్‌లో కూడా ఇండస్ట్రియల్ ఆక్సిజన్ యూనిట్ ఉంది. దీనిలో తయారైన ఆక్సిజన్‌లో కొంత భాగాన్ని ఇతర అవరాల కోసం లిక్విడ్ ఆక్సిజన్ ఎయిర్ సెపరేషన్ యూనిట్ ద్వారా మెడికల్ ఆక్సిజన్ గా మారుస్తారు. దీనినే వైద్య పరిభాషలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అంటారు" అని ఆయన చెప్పారు.
పొల్యూషన్ టెస్టింగ్ ల్యాబ్‌లో బుద్ధా రవిప్రసాద్‌కు 23 ఏళ్లు పని చేసిన అనుభవం ఉంది. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ 20.95 శాతం, నెట్రోజన్ 78 శాతం, అలాగే స్వల్ప మోతాడులో ఆర్గాన్, నియాన్, కార్బన్ డైయాక్సెడ్, హీలియం, హైడ్రోజన్ వాయువులు ఉంటాయని ఆయన చెబుతున్నారు. చుట్టూ ఉన్న గాలిలో అవి ఎక్కువ తక్కువ అయినా, వేరే ఏ వాయువులు కలిసినా మనం అనారోగ్యం పాలవుతామని తెలిపారు.
"మెడికల్ అసవరాలకు స్వచ్చమైన ఆక్సిజన్‌నే వాడతారు. పరిశ్రమల్లో తయారైయ్యే ఆక్సిజన్ 95 నుండి 99 శాతం వరకూ నాణ్యతతో ఉంటుంది. కొంత మలినాలతో కూడిన వాయువులు ఉంటాయి. మెడికల్ ఆక్సిజన్‌ను పూర్తిగా స్వచ్ఛంగా తయారు చేస్తారు. దానిలో ఇతర వాయువులు ఏవీ ఉండవు. మనిషి శ్వాసించే వాయువులా దీన్ని మార్చడం వల్ల దీనిని మెడికల్ ఆక్సిజన్ అంటారు" అని రవి ప్రసాద్ తెలిపారు.
విశాఖ ఉక్కుకు ఆక్సిజనే ఆధారం
కేంద్రం ఆదేశాలతో విశాఖ స్టీల్ ప్లాంట్, సెయిల్, టాటా స్టీల్, జేఎస్పీఎల్, జేఎస్ డబ్యూ స్టీల్ లాంటి ఉక్కు కర్మాగారాలతోపాటూ మిగతా ఆక్సిజన్ తయారీ యూనిట్లు కూడా మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి పెంచాయి. గతేడాది కూడా ఆక్సిజన్‌ను విజయవంతంగా ఆసుపత్రులకు సరఫరా చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రోజుకు ఎంత ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. దానిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేత, గంధం వెంకటరావు బీబీసీకి చెప్పారు.
"ఇనుము, ఉక్కు తయారు చేసే పరిశ్రమల్లో ఆక్సిజన్ అవరసం ఎప్పుడూ ఉంటుంది. పరిశ్రమ అవసరాల కోసం తయారయ్యే ఆక్సిజన్‌ను ఇండస్ట్రీయల్ ఆక్సిజన్ అంటారు. దీనిని రోలింగ్ మిల్స్, ఫర్నేస్, స్టీల్‌ను వివిధ ఆకారాల్లో కట్ చేయడానికి, ఎస్ఎంఎస్ ప్లాంట్, లేజర్ సెట్టింగ్ లాంటి వాటికి, అలాగే వివిధ ప్రాసెసింగ్ వ్యవస్థల దగ్గర ఇగ్నిషియన్ కోసం ప్రతి చోటా వాడుతాం".
"ఈ అవసరాల కోసం స్టీల్ ప్లాంట్‌లో అతి పెద్ద ఆక్సిజన్ ప్లాంట్ ఉంది. దీనిని ఎయిర్ సెపరేషన్ ఆక్సిజన్ ప్లాంట్ అంటారు. దీని ద్వారా నెలకు 8 వేల టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తున్నాం. అయితే ఇది ప్లాంట్ కెపాసిటీ కంటే తక్కువే. అవసరం మేరకే ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పుడు కేంద్రం ఆదేశించడంతో దానిని మరింత పెంచుకోవచ్చు. ఆ కెపాసిటీ విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని ఆక్సిజన్ ప్లాంట్‌కు ఉంది. గతేడాది కేంద్రం ఆదేశాల మేరకు ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని వివిధ ఆసుపత్రులకు 6 వేల నుంచి 8 వేల టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశాం" అని వెంకటరావు చెప్పారు.
స్టీల్ ప్లాంట్‌లో ఆక్సిజన్ ప్లాంట్
స్టీల్ ప్లాంట్ అవసరాల కోసం ఏడాదికి లక్ష టన్నుల వరకు ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుందని అందులో ఇంజనీరింగ్ విభాగం అధికారి వరప్రసాదరావు బీబీసీకి చెప్పారు. "స్టీల్ ప్లాంట్‌లోని ఆక్సిజన్ ప్లాంట్‌లో ప్రస్తుతం రోజుకి 100 టన్నుల నుంచి 150 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నాం. దీని సామర్ద్యం ఎక్కువగా ఉన్నప్పటీకి... అవసరాల మేరకే ఉత్పత్తి చేస్తోంది. దీనిలో కొంత భాగాన్ని మెడికల్ ఆక్సిజన్ గా మారుస్తున్నాం. అది ప్లాంట్‌లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు కోవిడ్ కారణంగా ఆసుపత్రులకు సరఫరా చేయడానికి దీన్ని ఎక్కువ తయారు చేస్తున్నాం. ఏపీ, తెలంగాణా, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు గత నాలుగు రోజులుగా దాదాపు 500 టన్నుల వరకు పంపించాం. కేంద్రం ఉత్పత్తి, సరఫరా పెంచమని చెప్పడంతో దీన్ని త్వరలో మరింత పెంచుతాం" అన్నారు.
28 స్టీల్ ప్లాంట్స్...లక్ష 30 వేల టన్నుల ఆక్సిజన్
విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రమే కాదు...దేశంలోని స్టీల్ ప్లాంట్ల్స్ అన్నీ మెడికల్ ఆక్సిజన్‌ను ఉత్పత్తిని చేస్తున్నాయి. కేంద్ర మంత్రిత్వ శాఖ దీనిపై ఎప్పటికప్పుడూ సమావేశాలు నిర్వహిస్తూ...స్టీల్ ప్లాంట్లకు ఆదేశాలు ఇస్తోంది. కరోనా తీవ్రం కావడంతో స్టీల్ మంత్రిత్వశాఖ అధికారులు నిరంతరం విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులతో మెడికల్ ఆక్సిజన్ తయరీ, నిల్వలపై మాట్లాడుతున్నారని స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘం నాయకులు ఆదినారాయణ చెప్పారు.
"ఉక్కు శాఖ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా మూడు రోజుల క్రితమే దేశంలో మెడికల్ ఆక్సిజన్ లభ్యతపై ఆ శాఖ అాధికారులతో సమావేశం నిర్వహించారు. స్టీల్ ప్లాంట్లలో ఉన్న ఆక్సిజన్ యూనిట్లు నిరంతరం పని చేయడం, ఎక్కడ అసవరం ఉంటే అక్కడికి ఆక్సిజన్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్న 28 మేజర్ స్టీల్ ప్లాంట్లు రోజూ 1500 టన్నుల మెడికల్ ఆక్సిజన్ సప్లై చేస్తున్నాయని...అలాగే అయా పరిశ్రమల అవసరాలకు కోసం నిల్వ ఉన్న ఆక్సిజన్ సైతం కోవిడ్ రోగులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలన్నారు" అని తెలిపారు.
ఇరవై మందిలో ముగ్గురికి ఆక్సిజన్ అవసరం
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా అందుతున్నలెక్కల ప్రకారం ప్రతి వందమంది కరోనా రోగుల్లో 20 మందిలో తీవ్రమైన లక్షణాలు ఉంటున్నాయి. వారిలో ముగ్గురికి ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి ఉంటోంది. కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో అన్ని రాష్ట్రాలూ తమ మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తిని వైద్య అవసరాల కోసమే ఉపయోగిస్తున్నాయని కేజీహెచ్ వైద్యులు శ్యామ్ సుందర్ బీబీసీకి చెప్పారు.
"గతేడాది కరోనా మొదటి దశలో కేజీహెచ్ లో ప్రత్యేకమైన కరోనా వార్డులు ఏర్పాటు చేశాం. అప్పుడు ఆక్సిజన్ అసవరం చాలా ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ సిలిండర్లు అందేవి. ఇప్పుడు కేసులు పెరుగుతుండటంతో గత ఐదు రోజులుగా స్టీల్ ప్లాంటే ఆక్సిజన్ సప్లై చేస్తోంది. అలాగే ముందస్తుగా కేజీహెచ్‌లో ఆక్సిజన్ సిలిండర్లు స్టాకు ఏర్పాటు చేసుకున్నాం. 30 టన్నుల కెపాసిటీ ట్యాంకులను కూడా సిద్ధం చేసుకున్నాం" అన్నారు.
వ్యాక్సిన్...ఆక్సిజన్ రెండూ కొరతే
మెడికల్ ఆక్సిజన్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఆక్సిజన్ బ్లాక్ మార్కెటింగ్ కూడా సాగుతోంది. మొదటి దశలో ఈ పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఆక్సిజన్ డిమాండ్ గత ఏడాది కంటే తీవ్రంగా కనిపిస్తోందని, బ్లాక్‌లో కొనడం లేదంటే ఎక్కువ డబ్బు బ్రోకర్లతో ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించుకోవాల్సి వస్తోందని మెడికల్ సెక్టారులో పని చేస్తున్న మోహనరావు చెప్పారు.
"ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా అన్నీ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత కనిపిస్తోంది. మా నాన్నకు కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ సిలిండర్ ఎలా సంపాదించావని, తెలిసిన వాళ్లు కొందరు నన్ను అడుగుతున్నారు. ప్రస్తుతం ఎక్కడా 40 శాతానికి మించి ఆక్సిజన్ అందుబాటులో లేదు. కరోనాతో పాటు ఇతర వ్యాధుల రోగులకు కూడా ఆక్సిజన్‌కు డిమాండ్ ఉంది. కరోనా మరింత తీవ్రం అవుతున్న సమయంలో ఒక వైపు వ్యాక్సిన్, మరో వైపు ఆక్సిజన్ రెండిటి కొరతా కనిపిస్తోంది" అన్నారు మోహనరావు.