మేం రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేస్తున్నాం. అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో మాకు రెండో పూట భోజనం దొరకడం లేదు. ఏం చేయగలం. మాకు వేరే దారి లేదు. రెండో పూట భోజనం వండుకోవాలని మాకూ ఉంటుంది. కానీ, మా దగ్గర సరిపడా డబ్బులు, సరకులు ఉండటం లేదు. ఇవి పాకిస్తాన్ కరాచీలోని దావూద్ గోఠ్ ప్రాంతంలో జీవించే రజియా మాటలు. ఆమె సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్లోని ఇళ్లలో ఇంటిపని చేస్తుంటారు.
50ఏళ్ల రజియా నెలకు రూ. పది వేల నుంచి రూ.12 వేల వరకు సంపాదిస్తారు. ఆమెకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో నలుగురు కుమార్తెలు. ఇద్దరు అబ్బాయిలు. ఐదేళ్ల క్రితం రజియా భర్త మరణించారు. రోజు ఎలా గడుస్తుంది? అని రజియాను బీబీసీ అడిగింది. అయితే, రోజు గడవడమేంటి? ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాంఅని ఆమె ఆవేదనతో చెప్పారు. నేను పనిచేస్తున్న ఇళ్లలో కొన్నిసార్లు భోజనం మిగిలిపోతుంటుంది. దాన్ని తీసుకొచ్చి పిల్లలకు పెడుతుంటాను. కానీ, రోజూ అలా మిగలదుఅని ఆమె అన్నారు. ఆరుగురు పిల్లలకు తిండి పెట్టడం చాలా కష్టం. రోజుకు ఒకసారి వండటానికే నా జీతం సరిపోతుందిఅని రజియా వివరించారు.
పాల ధర విపరీతంగా పెరిగిపోయింది. అందుకే టీ తాగడం కూడా మానేశాను. ఉదయం నేను సులేమానీ (గ్రీన్ టీ) చేస్తాను. అది కూడా పిల్లల కోసమేఅని ఆమె చెప్పారు. భోజనం ఖర్చుతోపాటు విద్యుత్ బిల్లు కూడా పెను భారంగా మారుతోందని ఆమె తెలిపారు. గత నెలలో తనకు రూ.2,500 బిల్లు వచ్చిందని ఆమె తెలిపారు. రూ.12,000లో రూ.2500 కరెంటు బిల్లుకు తీసేయాలి. ఆ తర్వాత మిగిలిన దాంట్లోనే పిల్లలకు నెల మొత్తం వండిపెట్టాలిఅని రజియా వివరించారు. రజియా ఒక్కరే కాదు. ఆమె లాంటి చాలా మందిది ఇదే పరిస్థితి.
మధ్యతరగతి కుటుంబానికి చెందిన రహీల్ భట్ ఉద్యోగం చేస్తుంటారు. ఆయన భార్య కూడా పనిచేస్తారు. ద్రవ్యోల్బణం వల్ల తమ కుటుంబంపైనా ప్రభావం పడుతోందని రహీల్ చెప్పారు. ఇది వరకు కారుపై ఆఫీసుకు వెళ్లేవాణ్ని. కానీ, పెట్రోలు ధరలు విపరీతంగా పెరగడంతో ఇప్పుడు బైక్‌పై వెళ్తున్నాను. వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి పనిచేస్తానని పైఅధికారులను అడిగాను. వారు సరేనన్నారు. ఇలా పెట్రోలు ఖర్చు తగ్గించుకుంటున్నానుఅని రహీల్ వివరించారు. ధరలు పెరగడం వల్ల కుటుంబ సభ్యుల చిన్నచిన్న కోరికలు కూడా తీర్చలేకపోతున్నాను. ఇదివరకు నెలకు ఒకసారైనా భార్యా, ఇద్దరు పిల్లలతో కలిసి బయట భోజనానికి వెళ్లేవాళ్లం. కానీ, ఇప్పుడు దాదాపు మూడు నెలలు గడిచింది. మేం అసలు బయటకు వెళ్లడం లేదు. జీతం డబ్బులన్నీ ఇంటి అద్దెకే సరిపోతున్నాయిఅని ఆయన అన్నారు.
నదీమ్ మెమన్‌కు కరాచీలో సొంత ఫ్యాక్టరీ ఉంది. అయితే, ద్రవ్యోల్బణం వల్ల ఆయన కూడా ఇబ్బంది పడుతున్నారు. మా వ్యాపారం ప్రభావితం అవుతోంది. దీంతో మా ఆదాయం తగ్గిపోతోందిఅని ఆయన చెప్పారు. ఒకవైపు విద్యుత్ బిల్లులు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు వస్తువుల ధరలు కూడా. దీంతో జీతాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారుఅని ఆయన వివరించారు. రోజురోజుకీ మార్కెట్‌లో ఖర్చులు పెరుగుతున్నాయి. దీంతో వ్యాపారంలో వచ్చే లాభం తగ్గిపోతోందిఅని ఆయన అన్నారు. రజియా, రహీల్, నదీమ్‌లు పాకిస్తాన్‌లో వరుసగా పేద, మధ్య తరగతి, ధనిక వర్గాలకు చెందినవారు. ధరల పెరుగుదల వల్ల వీరంతా ఇబ్బందులు పెడుతున్నారు.
ద్రవ్యోల్బణం ఎంత పెరిగింది?
జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి చెందిన గణాంకాలను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. దీనిలో ద్రవ్యోల్బణ రేటును 21 శాతంగా పేర్కొన్నారు. అయితే, ఇది మరింత పెరిగే ముప్పుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలరుతో పాకిస్తానీ రుపాయి మారకం విలువ పడిపోవడంతోపాటు పెట్రోలు, డీజిల్ ధరల పెరుగదల వల్ల ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతోంది. ఆహార పదార్థాలతోపాటు నిత్యవసరాలకు చాలావరకు దిగుమతులపైనే పాకిస్తాన్ ఆధారపడుతుంది. రానున్న రోజుల్లో పాకిస్తాన్ రూపాయి మారకపు విలువ మరింత పడిపోయే ముప్పుంది. దీంతో ధరలు కూడా పెరిగే అవకాశముంది.
ధరల పెరుగుదలకు కారణం ఎవరు?
రెండు, మూడు నెలల ముందువరకు రోజుకు రెండుసార్లు భోజనం దొరికేదని రజియా చెప్పారు. కానీ, ఇప్పుడు భోజనం ఒకపూట కూడా కష్టం అవుతోందని, దీనికి ప్రభుత్వమే కారణమని ఆమె అంటున్నారు. రహీల్ భట్ కూడా రజియాలానే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదివరకటి తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) ప్రభుత్వ హయాంలోనూ ద్రవ్యోల్బణం ఉండేదని, కానీ, ప్రస్తుత ప్రభుత్వం అన్ని రికార్డులను మించిపోతోందని ఆయన అన్నారు. నదీమ్ మెమన్ కూడా ప్రభుత్వం విషయంలో అసంతృప్తితో ఉన్నారు. విద్యుత్, గ్యాస్ ఇతర నిత్యవసరాల ధరల పెరుగుదల వల్ల తమ వ్యాపార ఖర్చులు పెరుగుతున్నాయని ఆయన చెబుతున్నారు.
అయితే, ద్రవ్యోల్బణానికి అంతర్జాతీయ పరిస్థితులు కారణమని దేశ ఆర్థిక మంత్రి డాక్టర్ హఫీజ్ పాషా బీబీసీతో చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో చమురు, గ్యాస్ ధరలు పెరిగాయని ఆయన అన్నారు. ఇదివరకటి పీటీఐ ప్రభుత్వం చేసిన పనులకు ప్రస్తుత ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. మరోవైపు అంతర్జాతీ పరిస్థితులు కూడా అనుకూలంగా లేవుఅని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఆర్థిక నిపుణుడు ఆమిర్ ఖాన్.. ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అంతర్జాతీయ పరిణామాలే కారణమని చెప్పారు. అంతర్జాతీయంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. అవి పాకిస్తాన్ మీద కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయిఅని ఆయన అన్నారు.
ఎలా పెరుగుతోంది?
ద్రవ్యోల్బణం వల్ల పాకిస్తాన్‌లో సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదివరకటి పీటీఐ ప్రభుత్వం తొలి ఆర్థిక సంవత్సరం ముగిసేటానికి అంటే జూన్ 2019నాటికి ద్రవ్యోల్బణ రేటు 8 శాతంగా ఉండేది. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 8.1 శాతం. ఆ తర్వాత ఏడాదికి అంటే జూన్ 2020కి ద్రవ్యోల్బణ రేటు 8.6 శాతంగా ఉండేది. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 14.6 శాతంగా ఉండేది. జూన్ 2021నాటికి వస్తువుల ద్రవ్యోల్బణం 9.7 శాతంగా ఉండగా.. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 10.5 శాతానికి చేరుకుంది. ఏప్రిల్‌లో పాకిస్తాన్‌లో పీటీఐ ప్రభుత్వం కుప్పకూలేనాటికి ద్రవ్యోల్బణ రేటు 10.7 శాతంగా ఉండేది. ఆ తర్వాత విపరీతంగా ధరలు పెరుగుతూ వెళ్లాయి. ప్రస్తుతం ఇది 20 శాతానికి మించిపోయింది.
గత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో వంట నూనె 48 శాతం, కూరగాయలు 35 శాతం, పప్పులు 38 శాతం, కోడి మాంసం 20 శాతం, మేక మాంసం 23 శాతం చొప్పున ధరలు పెరిగాయి. ముస్లిం లీగ్ (నవాజ్) ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొదటి నెలలో ద్రవ్యోల్బణ రేటు 13.37 శాతంగా ఉండేది. మే నెలలో ఇది 13.76 శాతానికి చేరుకుంది. కానీ, జూన్‌లో మాత్రం 21.32 శాతానికి పెరిగింది. ప్రస్తుతం ఉల్లిపాయలు 124 శాతం, వంట నూనె 70 శాతం, చికెన్ 47 శాతం, గోధుమలు 31 శాతం, పాలు 21 శాతం ధరలు పెరిగాయి. ఆర్థిక సంవత్సరం చివరినాటికి మొత్తంగా ద్రవ్యోల్బణం 21 శాతం మించిపోవచ్చని డాక్టర్ హఫీస్ పాషా వివరించారు. ఇలాంటి రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం 2008, 1974లలో మాత్రమే నమోదయ్యింది.