బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (13:34 IST)

హైదరాబాద్ పోలీసులకు రాజస్థాన్ దొంగ సవాల్... 'పట్టుకోండి చూద్దాం': ప్రెస్ రివ్యూ

రాజస్థాన్‌కు చెందిన ఒక దొంగ హైదరాబాద్ పోలీసులకు సవాల్ విసిరినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక ఒక వార్తా కథనం ప్రచురించింది. రాజస్థాన్‌కు చెందిన ఒక దొంగ హైదరాబాద్ పోలీసు అధికారికి వీడియో కాల్ చేసి మరీ తనను పట్టుకోమని సవాల్ విసిరారు. 
 
''సార్‌ నమస్తే. మీరు నన్ను పట్టుకోవడానికి వచ్చారు. హైదరాబాద్‌ నుంచి ఫలానా ట్రైన్‌లో వచ్చారు. మా రాష్ట్రంలో ఫలానా చోట దిగి.. ఆరా తీస్తూ నా ఆచూకీ గుర్తించారు. ఇందుకు మీరు చేసిన ప్రయత్నానికి హ్యాట్సాఫ్‌. కానీ, నేను చిక్కుతానని నమ్మకం పెట్టుకోవద్దు. నేను కొట్టేసిన కారు ఆచూకీ కూడా.. నేను దయ తలిచి చెబితే తప్ప మీరు తెలుసుకోలేరు.
 
ఎలాగూ ఇంత దూరం వచ్చారు. మీరున్న చోటుకు కొద్ది దూరంలో మాంచి హోటల్‌ ఉంది. ఫుడ్‌ మస్తుగ ఉంటది. చక్కగా లాగించి వెళ్లండి. మిమ్మల్ని మా అతిథులుగా భావించి బిల్లు కూడా నేనే కడతా..'' ఒక నిర్మాత కారు చోరీ కేసులో ఆరా తీస్తూ రాజస్థాన్‌కు వెళ్లిన పోలీసులకు ఓ దొంగోడు ఇచ్చిన ఝలక్‌ ఇది!
 
అంతేనా.. ''నా స్క్రీన్‌ షాట్‌ తీసి పెట్టుకోండి. నా అంతట నేను దొరికిపోవాలని అనుకుంటే తప్ప.. మీరు దణ్ణ పెట్టి వేడుకున్నా నేను దొరకను'' అంటూ మరో పోలీసు అధికారికి వీడియో కాల్‌ చేసి కాలరెగరేశాడు. కారు కూడా తనకు నచ్చినన్నాళ్లు వాడుకుని ఎక్కడో ఒక చోట వదిలేస్తానని, అప్పుడు దాన్ని స్వాధీనం చేసుకోవాలని ఉచితసలహా కూడా ఇచ్చాడు.
 
దీంతో.. ఎన్నో క్లిష్టమైన కేసులను సైతం ఛేదించిన రికార్డు ఉన్న బంజారాహిల్స్‌ పోలీసులే ఏం చేయలేక రెండు నెలలుగా తమ ప్రయత్నాలు మానుకున్నారు. ఆ నేరగాడు దొరికినప్పుడే చూద్దాంలే అనే ధోరణిలో పడ్డారు అని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 
 
ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ గురువారం ఉదయం దిల్లీ వెళ్లనున్నారని అన్ని దినపత్రికలు వార్తా కథనం ప్రచురించాయి. ఏపీ సీఎం జగన్ రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నారు. గురువారం రాత్రి 1-జన్‌పథ్‌లోని ఏపీ సీఎం అధికారిక నివాసంలో జగన్‌ బస చేయనున్నారు.
YS jagan
 
హోంమంత్రితో భేటీని బట్టి ఇతర కేంద్ర మంత్రులను సీఎం కలిసే అవకాశం ఉంది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, పెట్రోలియం, ఉక్కుశాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రైల్వే, కేంద్ర పరిశ్రమల శాఖల మంత్రి పీయూష్‌ గోయల్‌ తదితరులను కలిసేందుకు వారి అపాయింట్‌మెంట్ల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం సమాచారం పంపినట్లు తెలిసింది.
 
సీఎం వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సీఎం జగన్ దిల్లీ నుంచి తిరిగి ఏపీ చేరుకుంటారని తెలిపింది. 
 
ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని తాకాయని ఓ దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది. శుక్రవారం నుంచి రాష్ట్రంలో ఈ రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించనున్నాయి. ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. 
 
మరోవైపు తూర్పు ఈశాన్య బంగాళాఖాతం, మయన్మార్‌ పరిసర ప్రాంతంలో సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 11న అల్పపీడనంగా బలపడనుంది.
 
ఈ అల్పపీడనం ఒడిశా తీరం వైపు ప్రయాణిస్తూ క్రమంగా బలపడి 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఈ కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
 
ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 200 నుంచి 250 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
 
అల్పపీడనంతో నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకోనున్నాయి. ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాలకు విస్తరించిన రుతుపవనాలు శుక్రవారానికి ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి ప్రవేశించనున్నాయి. 12వ తేదీ నాటికి రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశాలున్నాయిని వాతావరణ శాఖ చెప్పినట్లు సాక్షి వివరించింది.
 
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 42 మందికి పెంపు
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42 కు పెంచుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక నిర్ణయం తీసుకున్నారని నమస్తే తెలంగాణ దినపత్రిక వార్త ప్రచురించింది. ఏండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న సంబంధిత ఫైలుపై ఆయన బుధవారం సంతకం చేశారు.
 
జడ్జీల సంఖ్యను ఏకంగా 75% పెంపుదల చేశారు. వీరిలో 32 మంది శాశ్వత న్యాయమూర్తులు, మిగిలిన పది మంది అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తిస్తారు. 42మందిలో 28 మంది బార్‌ అసోసియేషన్‌ నుంచి న్యాయవాదులను ఎలివేషన్‌ చేస్తారు. మిగిలిన 14 మందిని జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ నుంచి ఎంపిక చేస్తారు.
 
ఈ నిర్ణయం ఈ నెల 8 నుంచే అమల్లోకి వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. 2019 ఫిబ్రవరి 13న హైకోర్టు ప్రధాన నాయమూర్తి, తర్వాత గవర్నర్‌, సీఎం కేసీఆర్‌.. న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని కేంద్రప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
 
ఈ మేరకు ప్రధాని, కేంద్ర న్యాయశాఖ మంత్రులు కూడా సమ్మతి తెలిపారు. జస్టిస్‌ ఎన్వీ రమణ సీజేఐగా బాధ్యతలు చేపట్టగానే దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించారు.
 
తెలంగాణ హైకోర్టు ప్రతిపాదనకు కేంద్రన్యాయశాఖ ఈ ఏడాది మే 27న ఆమోదం తెలిపి, ఈ నెల 7న సీజేఐకి ఫైలు పంపింది. ఫైలు అందిన వెంటనే జడ్జిలను నియమిస్తూ సీజేఐ నిర్ణయం తీసుకున్నారని నమస్తే తెలంగాణ వివరించింది.