శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 మే 2021 (13:08 IST)

రాజస్థాన్‌లో 600 మంది చిన్నారులకు అస్వస్థత..300మందికి పాజిటివ్.. థర్డ్ వేవేనా..?

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌లో భారీగా విజృంభిస్తుంది. ముఖ్యంగా యువతపై ప్రభావం చూపుతుందని, పెద్ద సంఖ్యలో యువత ప్రాణాలు కోల్పోతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. త్వరలోనే థర్డ్‌ వేవ్‌ ముంపు పొంచి ఉందని, చిన్నారులపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఈ క్రమంలో రాజస్థాన్‌లో రెండు రోజుల్లో సుమారు 600 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. 
 
దౌసా, దుంగార్‌పూర్‌ జిల్లాలోని 600 మంది చిన్నారులకు అనారోగ్యం పాలవగా.. వారికి కరోనా లక్షణాలు ఉన్నట్లు సమాచారం. వీరిలో 300 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఒక్కసారిగా రాజస్థాన్‌లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసింది.
 
దౌసాలోని సిక్రై సబ్ డివిజన్‌లోని ఒక గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు కరోనా లాంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఇటీవల సదరు బాలికల తండ్రి కరోనా వైరస్‌ కారణంగా మరణించాడు. తండ్రి మరణం తర్వాత ఆ బాలికలిద్దరూ వైరస్‌ బారినపడినట్లు భావిస్తున్నారు.
 
అలాగే దౌసాలో మరో రెండేళ్ల చిన్నారికి సైతం వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దౌసాలో ఈ నెల 1 నుంచి 21వ తేదీల మధ్య 18 ఏళ్లలోపు వయసున్న 241 మంది పిల్లలు మాత్రమే కరోనా బారినపడినట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు, దుంగార్‌పూర్‌లో పిల్లల్లో వైరస్ సంక్రమణ కేసులు వేగంగా పెరిగాయి. దుంగార్‌పూర్‌లో ఈ నెల 12 నుంచి 22 తేదీల మధ్య 255 మంది చిన్నారులకు వైరస్‌ సోకింది.