శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : మంగళవారం, 26 జనవరి 2021 (13:36 IST)

Tractor Rally: బస్ ధ్వంసం చేసిన నిరసనకారులు, రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

దేశ రాజధాని దిల్లీ శివారుల నుంచి మొదలైన రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారుతోంది. ట్రాన్స్‌పోర్ట్ నగర్ వద్ద బారికేడ్లను తొలగించి ముందుకు సాగేందుకు ప్రయత్నించిన రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈస్ట్ దిల్లీలో ఘాజీపుర్ నుంచి అక్షర్‌ధామ్ వైపుగా వస్తున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

 
ఐటీవో, ప్రగతి మైదాన్ వద్ద బాష్పవాయు గోళీలను ప్రయోగించారు. దిల్లీలోని అనేక మెట్రో రైలు స్టేషన్లను మూసివేశారు. ఇంద్రప్రస్థ, సమయ్‌పూర్ బద్లీ, రోహిణీ సెక్టార్ 18, 19, హైదర్‌పూర్ బద్లీ, జహంగీర్ పురా, ఆదర్శ్ నగర్, అజాద్ పూర్, మోడల్ టౌన్, జీటీడీ నగర్, విశ్వవిద్యాలయ, విధాన సభ, సివిల్ లైన్ మెట్రో స్టేషన్లను మూసివేశారు.

 
ఘాజీపూర్ నుంచి వస్తున్న ట్రాక్టర్ ర్యాలీ సరాయి ఖాలేఖాన్ వరకు.. అలాగే ఐటీవో వరకు మరో భారీ ట్రాక్టర్ల శ్రేణి చేరుకున్నాయి. ఐటీవో వద్ద నిరసనకారులు దిల్లీ రవాణా సంస్థకు చెందిన ఒక బస్సును ధ్వంసం చేశారు. దిల్లీ-నోయిడా, దిల్లీ-ఘాజియాబాద్ కూడలికి సమీపంలో అక్షర్‌ధామ్ దేవాలయం వద్ద పోలీసులు, నిరసనకారుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టియర్ గ్యాస్ ప్రయోగించారు.

 
దిల్లీ-మేరఠ్ ఎక్స్‌ప్రెస్ హైవేపై పాండవ్ నగర్ వద్ద రైతులు రాకుండా లారీలను అడ్డంగా పెట్టగా వాటిని దాటుకుంటూ రైతులు ముందుకు సాగారు. మరోవైపు పశ్చిమ దిల్లీలోని నాంగ్‌లోయి వరకు ట్రాక్టర్ల ర్యాలీ చేరుకుందని, దిల్లీ సరిహద్దు దాటి సుమారు 20 కిలోమీటర్ల వరకు ర్యాలీ వచ్చిందని, పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు, అంతకుమించిన సంఖ్యలో రైతులు, వారి మద్దతుదారులు అక్కడికి చేరుకున్నారని, ర్యాలీ శాంతియుతంగా సాగుతోందని బీబీసీ ప్రతినిధి దిల్ నవాజ్ పాషా చెప్పారు.

 
కర్నాల్ వద్ద నిరసనకారులు బారికేడ్లను తొలగించి దిల్లీలోకి వస్తున్న దృశ్యాలను ఏఎన్ఐ వార్తాసంస్థ ట్వీట్ చేసింది. సంజయ్ గాంధీ ట్రాన్స్‌పోర్ట్ నగర్ వద్ద పోలీసులకు చెందిన వాటర్ కేనన్ వాహనంపైకి రైతులు ఎక్కారు. తాము శాంతియుతంగా రింగ్ రోడ్‌వైపు వెళ్లాలనుకుంటున్నామని.. కానీ, పోలీసులు తమను అడ్డుకుంటున్నారని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నేత సత్నామ్ సింగ్ పన్ను చెప్పారు. సింఘు బోర్డర్ వద్ద ఉన్న పోలీసులకు తాము వారి సీనియర్లతో మాట్లాడమని చెప్పామని.. అందుకు 45 నిమిషాల సమయం కూడా ఇచ్చామని ఆయన చెప్పారు.

 
అంతకుముందు హరియాణా సరిహద్దుల్లోని టిక్రీ వద్ద రైతులు పోలీసు బారికేడ్లను విరగ్గొట్టి దిల్లీలోకి ప్రవేశించారని ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది. సింఘు బోర్డర్ నుంచి కాంఝీవాలా చౌక్-ఓచాందీ బోర్డర్ వైపు భారీ సంఖ్యలో ట్రాక్టర్లు వెళ్తున్నాయని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. సింఘు బోర్డర్ వైపు నుంచి ర్యాలీగా వచ్చిన ట్రాక్టర్లు దిల్లీలోని సంజయ్ గాంధీ ట్రాన్స్‌పోర్ట్ నగర్ వరకు చేరుకున్నాయి. అక్కడి నుంచి డీటీయూ, షాబాద్, కాంఝావాలా చౌక్, ఖార్‌ఖోడా టోల్ ప్లాజా వైపు వె ళ్లేందుకుప్రయత్నించాయి.

 
ట్రాన్స్‌పోర్ట్ నగర్ వద్ద భారీ ఎత్తున భద్రతా బలగాలు రైతులను అడ్డుకున్నాయి. రోడ్డుకు అడ్డంగా పెద్దపెద్ద సిమెంట్ బ్లాకులు పెట్టి రైతులు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. భద్రతాదళాలు, రైతులు పెద్దసంఖ్యలో ఉండడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా కనిపిస్తోంది. ముందుకు సాగేందుకు రైతులు ప్రయత్నిస్తుండగా వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. షాజాన్-ఖేడా సరిహద్దుల్లో ట్రాక్టర్లు రాకుండా భారీ సిమెంట్ బ్లాకులతో రోడ్లను మూసేశారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.

 
మరోవైపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు, ఇతర భద్రతా బలగాలను ఎక్కడికక్కడ మోహరించారు. ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రత కట్టుదిట్టంగానే ఉంటుంది. అయితే, ఈసారి అదే రోజున రైతుల ట్రాక్టర్ ర్యాలీ కూడా ఉండడంతో మరింతగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ రైతులు ఈ ర్యాలీ తలపెట్టారు.

 
ఇన్ని ట్రాక్టర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి
ఈ ర్యాలీకి పంజాబ్‌, ఇతర రాష్ట్రాల రైతుల తమ ట్రాక్టర్లను పంపిస్తున్నారు. పంజాబ్‌లోని పధియానాకు చెందిన రైతు అమర్‌జీత్ సింగ్ బైంస్ తన మూడు ట్రాక్టర్లను పంపించారు. అమర్‌జీత్‌కు ఏడు ట్రాక్టర్లు, నాలుగు కార్లు, జీపులు ఉన్నాయి. అయితే దిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనల కోసం ఆయన తన నాలుగు ట్రాక్టర్లు, రెండు ఇతర వాహనాలను అమ్మేశారు.

 
‘‘నేను 20 హెక్టార్ల భూమిని సాగు చేస్తాను. నాకు ట్రాక్టర్లంటే చాలా ఇష్టం. అన్ని కంపెనీల కొత్త మోడల్స్‌ను కొంటుంటాను. కానీ నేటి పరిస్థితులు వేరు. మా ఉద్యమమే నేడు నాకు అన్నింటి కంటే ఎక్కువ’’ అని బీబీసీ పంజాబీతో ఆయన చెప్పారు.
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేంగా పంజాబ్‌లోని రైతులు చేస్తున్న పోరాటానికి అమర్‌జీత్ కథ అద్దంపడుతోంది. పధియానా తరహాలోనే పంజాబ్‌లోని చాలా గ్రామాల నుంచి ట్రాక్టర్లు వస్తున్నాయి.

 
ఈ ర్యాలీ కోసం వ్యక్తిగతంగా కాకుండా.. సమిష్టిగా రైతులు ముందుకు కదులుతున్నారు. ‘‘దిల్లీ లోపల మేం ట్రాక్టర్లతో ప్రదర్శన చేపడతాం. దీని కోసం ప్రత్యేకంగా ట్రాక్టర్లను సిద్ధంచేశాం. అందరమూ గట్టిగా నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొంటాం. ఇది మా మనుగడ కోసం చేస్తున్న పోరాటం. దీనిలో ఎలాగైనా విజయం సాధిస్తాం’’ అని అమర్‌జీత్ అన్నారు. ప్రతి గ్రామం నుంచీ ఇప్పటికే వేల మంది రైతులు దిల్లీకి చేరుకున్నారని రైతు నాయకులైన సురీందర్ మాన్ (పంజాబ్), సత్ సింగ్ (హరియాణా) బీబీసీ పంజాబ్‌తో చెప్పారు

 
ఎన్ని ట్రాక్టర్లు పాల్గొంటున్నాయి?
ఈ ర్యాలీలో ఎన్ని ట్రాక్టర్లు పాల్గొంటున్నాయో కచ్చితంగా అంచనా వేయడం కొంచెం కష్టమని బీబీసీ పంజాబీతో రైతు నాయకుడు రాజీందర్ సింగ్ దీప్ సింగ్‌వాలా చెప్పారు. అంబాలా నుంచి లుధియానా వరకు అమృత్‌సర్-దిల్లీ జాతీయ ప్రధాన రహదారిపై రెండు వరుసల్లో ఈ ట్రాక్టర్లు వచ్చినట్లు భారతీయ కిసాన్ యూనియన్ (దోవాబా) జనరల్ సెక్రటరీ బల్‌దేవ్ సింగ్ సిర్సా చెప్పారు.

 
జనవరి 23న పంజాబ్ ఫగ్వాడా డివిజిన్ నుంచి 2500 ట్రాక్టర్లు వెళ్లినట్లు భారతీయ కిసాన్ యూనియన్‌కు చెందిన మరో నాయకుడు సత్నం సింగ్ సాహ్ని చెప్పారు. జలంధర్, హోషియార్‌పుర్, కపూర్తలా, షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాల నుంచి ఇప్పటికే 2000 ట్రాక్టర్లు దిల్లీ చేరుకున్నట్లు వివరించారు.

 
ట్రాక్టర్లను ఎలా సిద్ధంచేశారు?
పోరాటాలకు వెళ్తున్న వాహనాల్లా ఈ ట్రాక్టర్లను ప్రత్యేకంగా సిద్ధంచేశారు. ప్రతిఘటన ఎదురైనా గట్టిగా నిలిచేలా ఈ ట్రాక్టర్లను సిద్ధం చేసినట్లు జలంధర్‌లోని దేవోబా కిసాన్ సంఘర్ష్ సమితి నాయకుడు హర్షిలేందర్ సింగ్ చెప్పారు. రిమోట్‌ కంట్రోల్‌తో, డ్రైవర్ సాయం లేకుండానే, నడిచే ఓ ట్రాక్టర్‌ను జీరాకు చెందిన ఓ మెకానిక్ ప్రత్యేకంగా సిద్ధంచేశారు. చాలా ట్రాక్టర్లలో ఇనుము పెట్టెలను ఏర్పాటు చేశారు. నీటి క్యానన్లు ప్రయోగించినా, లాఠీఛార్జి చేసినా దెబ్బతినకుండా మార్పులు చేశారు. తమ ట్రాక్టర్లను రైతులు ప్రత్యేకంగా అలంకరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు అడ్డుగోడలను దాటి ముందుకు వెళ్లేందుకు కొన్ని క్రేన్లు కూడా తీసుకొస్తున్నారు. వీటి బంపర్లకు ముందు ఇనుము వస్తువులను కూడా అమర్చారు. దీంతో తేలిగ్గానే బారికెడ్లు లాంటి అడ్డుగోడలను దాటి రావొచ్చు.

 
శకటాల తరహాలో..
తమ సాంస్కృతిక, సామాజిక పరిస్థితులు, రైతుల జీవితం, మత సాంప్రదాయాలు ఉట్టిపడేలా ట్రాక్టర్లను రైతులు ముస్తాబు చేశారు. కొన్ని ట్రాక్టర్లు గణతంత్ర శకటాలను తలపిస్తున్నాయి. పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్‌లకు చెందిన రైతులు స్థానికంగా పండే పంటలను కొన్ని ట్రాక్టర్లలో తీసుకు వస్తున్నారని యునైటెడ్ కిసాన్ మోర్చా తెలిపింది. ట్రాక్టర్లపై జాతీయ జెండాలతో పాటు ఎర్రజెండాలు, ఖాల్సా ముద్రలు కూడా కనిపిస్తున్నాయి. సిక్కుల గురువు బాబా బందా సింగ్ బహదూర్ ఫోటోలతో బ్యానర్లు కూడా ఏర్పాటుచేశారు.