గణతంత్ర దినోత్సవం: ఢిల్లీలో హై అలెర్ట్.. రైతుల ట్రాక్టర్ మార్చ్
జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ అప్రమత్తమైంది. ఓ వైపు గణతంత్ర దినోత్సవ వేడుకలు, మరోవైపు రైతుల ట్రాక్టర్ మార్చ్ నిర్వహిస్తుండడం పోలీసులకు సవాల్‌గా మారింది. ట్రాక్టర్ మార్చ్‌కు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వడంతో రైతు సంఘాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఉదయం 10 గంటలకు ర్యాలీ ప్రారంభం కానుంది. సింఘు, టిక్రీ, గాజీపూర్ సరిహద్దు నుంచి రైతుల పరేడ్ ప్రారంభం కానుంది.
ఈ రూట్లలో, పంజాబ్, హర్యానా, యూపీ రైతులు పాల్గోనున్నారు. మూడు రూట్లలో 170 కిలోమీటర్ల వరకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహణకు పోలీసులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అయితే రైతులు మాత్రం ముందుగా తాము అనుకున్న రూట్ లోనే మార్చ్ నిర్వహిస్తామని చెబుతున్నారు. ట్రాక్టర్ ర్యాలీ కోసం రైతులు 3000 మంది వాలంటీర్లను నియమించారు.
మొత్తం 6 లక్షల ట్రాక్టర్లు ర్యాలీలో పాల్గోనున్నట్లు రైతు సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే చాలా రాష్ట్రాల నుంచి వేలాది ట్రాక్టర్లలో రైతులు ఢిల్లీకి తరలివస్తున్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి 25 వేల ట్రాక్టర్లు మార్చ్ లో పాల్గోనున్నాయని భారతీయ కిసాన్ యూనియన్ పేర్కొంది.
రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ట్రాక్టర్ ర్యాలీని పాక్ ఐఎస్ఐతో పాటు తీవ్రవాదులు హైజాక్ చేసే అవకాశముందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసు వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఢిల్లీ పోలీసులు ట్రాక్టర్ మార్చ్‌కు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రతి ట్రాక్టర్ పై త్రివర్ణ పతాకం రెపరెపలాడనుంది. జానపద, దేశ భక్తి గేయాలతో ట్రాక్టర్ మార్చ్ సాగనుందని రైతు సంఘం ప్రతినిధులు వెల్లడించారు. రైతులంతా 24 గంటలకు సరిపడా ఆహారం, నీరు తమ వెంట ఉంచుకోవాలని సూచించారు.
ఈ ర్యాలీలో ఏ పార్టీకి చెందిన జెండా కనపడకూడదని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. రైతులు తమ వెంట ఆయుధాలు, లాఠీలు తీసుకురావొద్దని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని ఆదేశించాయి. గణతంత్ర ట్రాక్టర్ పరేడ్ లో రైతులు శకటాలను కూడా ప్రదర్శించనున్నారు.
మరోవైపు ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొనకుండా చేసేందుకు యూపీ పోలీసులు రైతులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అంతేకాదు, ట్రాక్టర్లకు డీజిల్ ఇవ్వొద్దని పెట్రోల్ బంకులకు ఆదేశాలిచ్చారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీ ని పాక్ ఐఎస్‌ఐ సంస్థతో పాటు ఖలిస్తానీ తీవ్రవాదులు హైజాక్ చేసే అవకాశాలున్నాయని, రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు.
ర్యాలీని దెబ్బతీసేందుకు పాకిస్తాన్‌కు చెందిన మూడు వందలకు పైగా ట్విట్టర్ హ్యాండిల్స్‌ను గుర్తించామని పోలీసులు ప్రకటించారు. ఈ కుట్రను గుర్తించిన నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా బందోస్తును మరింత పటిష్ఠం చేశారు.