భారత్ బంద్ సక్సెస్ : రంగంలోకి దిగిన అమిత్ షా!
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను తక్షణం వెనక్కి తీసుకోవాలన్న ఏకైక డిమాండ్‌తో మంగళవారం పలు రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైంది. ఈ బంద్‌కు పలు రాజకీయ పార్టీలతో పాటు.. అనేక కార్మిక సంఘాలు కూడా, ఇతర వర్గాల వారు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన ఈ బంద్ విజయవంతమైంది. సాధారణ ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాలుగు గంటల పాటు భారత్ బంద్ చేపట్టారు.
అయితే, ఇప్పటివరకు రైతు నేతలతో కేంద్ర జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. రైతులతో చర్చలకు సిద్ధమయ్యారు. చర్చలకు రావాల్సిందిగా అమిత్ షా నుంచి పిలుపు వచ్చినట్టు రైతు నేత రాకేశ్ తెలిపారు. అమిత్ షా నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని... చర్చలకు రావాలని ఆయన తమను ఆహ్వానించారని రాకేశ్ చెప్పారు. సాయంత్రం 7 గంటలకు సమావేశం జరగనుందని తెలిపారు. ఢిల్లీ చుట్టుపక్కల జాతీయ రహదారులపై నిరసనలు తెలుపుతున్న రైతు నేతలందరూ ఈ చర్చలకు హాజరవుతారని చెప్పారు.
అంతకుముందు.. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కూడా ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా కొన్ని రోజులుగా ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
వారికి మద్దతుగా దేశమంతటా ప్రజలు ఆందోళన చేపట్టాలని తాను కోరుతున్నానని తెలిపారు. రైతులంతా రోడ్లపైకి వచ్చి నిరసన తెలపాలని, ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని, రైతుల డిమాండ్లను పరిష్కరిస్తుందని చెప్పారు.
ఈ ఆందోళనల్లో హింసాత్మక చర్యలకు మాత్రం పాల్పడకూడదని ఆయన చెప్పారు. స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను వెంటనే అమలు చేయాలని, అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ కమిషన్ కి స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.