శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2020 (10:51 IST)

లండన్‌కు తాకిన భారత రైతుల ఆందోళన సెగ : పలువురి అరెస్టు

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ దేశంలో రైతులు చేస్తున్న ఆందోళన బ్రిటన్‌కు పాకింది. ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలుపుతూ లండన్ వీధుల్లో అనేక మంది భారతీయులతో పాటు.. బ్రిటన్ పౌరులు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. 
 
సెంట్రల్ లండన్‌ వేదికగా వేలమంది భారత సంతతి ప్రజలు నిరసనలకు దిగి, రైతులకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేయడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించారంటూ, పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. తామంతా రైతులకు మద్దతిస్తున్నామని ర్యాలీలో పాల్గొన్నవారు చెప్పుకొచ్చారు.
 
కాగా, లండన్‌లోని ఆర్డ్ విచ్ వద్ద ఉన్న ఇండియన్ ఎంబసీ కార్యాలయం ఎదుటకు చేరుకున్ననిరసనకారులు, ట్రఫాల్గర్ స్క్వేర్ ఏరియాలో ప్రదర్శన నిర్వహించారని ఆ సమయంలో అక్కడే ఉన్న రాయిటర్ ఫోటోగ్రాఫర్ ఒకరు తెలిపారు.
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, నిరసనకారులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. కరోనా వ్యాప్తి నివారణకు కఠినమైన నిబంధనలు అమల్లో ఉన్నాయని, నిరసనలకు అనుమతి లేదని వారు హెచ్చరించారు. ప్రజలు వినకపోవడంతో అరెస్టు చేసి తీసుకెళ్లారు.
 
ఈ నిరసనల్లో బ్రిటీష్ సిక్కులతో పాటు, వివిధ రాష్ట్రాలకు చెంది, ప్రస్తుతం లండన్‌లో ఉన్న వారు ఎందరో ఉన్నారు. వీరంతా భౌతికదూరాన్ని పాటించలేదని తెలుస్తోంది. కొద్దిమంది మాత్రమే ఫేస్ మాస్క్‌లు ధరించారు. తమ కార్లను రోడ్లపై నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. 
 
ఈ ఆందోళనలపై స్పందించిన భారత హై కమిషన్ ప్రతినిధి, ఇక్కడి ప్రజల అభిప్రాయాలను ఇండియాకు తెలియజేస్తామని, అయితే, అనుమతి లేకుండా ఇలా వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగడం సరికాదని అభిప్రాయపడ్డారు.