శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి

రైతులను పట్టించుకోని మోదీ సర్కారు.. చలికి 20మంది రైతన్నల మృతి

దేశానికి అన్నం పెట్టే రైతులు దేశ రాజధాని ఢిల్లీలో రోడ్డెక్కి 23 రోజులు అయ్యింది. అయినా పట్టించుకునే నాథుడే లేడు. సర్కారు నుంచి స్పందన కరువైంది. వ్యవసాయాని వెన్నుదన్నుగా వుండే రైతుల ఆందోళనను తీసిపారేసి తమ పని తాము చేసుకుపోతోంది కేంద్రం. అయితే చలిగాలులు చుట్టిముట్టినా.. వైరస్ భయం ఉన్నా.. తమ డిమాండ్లు నెరవేరే వరకూ ఢిల్లీ సరిహద్దుల నుంచి కదిలే ప్రసక్తే లేదంటున్నారు రైతులు. 
 
చావుకు కూడా వెనకాడకుండా ఉద్యమానికి సై అంటున్నారు. చలిగాలులకు రైతుల ప్రాణాల్లో గాల్లో కలుస్తున్నాయి. ఇప్పటి వరకూ 20 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దేశ, విదేశాల నుంచి రైతుల ఆందోళనలకు మద్దతు పెరుగుతోంది. బ్రిటన్‌ ఎంపీ ప్రీతికౌర్‌ గిల్‌ రైతులకు సంఘీభావం ప్రకటించారు. ప్రజాస్వామ్య పోరాటాలకు యూకే అండగా నిలుస్తుందని గిల్‌ ట్వీట్ చేశారు. 
 
రైతుల విషయంలో బ్రిటీషర్ల కంటే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటూ కేంద్రంపై మండి పడ్డారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీలోవ్యవసాయ చట్టాల ప్రతులను చింపివేశారు సీఎం కేజ్రీవాల్. కరోనా కాలంలో అత్యవసరంగా పార్లమెంట్‌లో బిల్లులను ఆమోదించారని మండిపడ్డారు. రాజ్యసభలో ఓటింగ్‌ జరగకుండ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా చట్టాలను ఆమోదించిందన్నారు. 
 
ఢిల్లీ- హరియాణా సరిహద్దులోని టీక్రీ వద్ద ఉద్యమంలో పాల్గొన్న పంజాబ్‌కు చెందిన రైతు తీవ్రమైన చలితో చనిపోయాడు. రైతుల్ని ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాలంటీర్లు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు కలుస్తున్నారు. దుప్పట్లు, ఆహార పదార్థాలు అందిస్తున్నారు. రైతుల కష్టాలేంటో మాకు తెలుసు... ఆందోళనలు చేయడమే మీకున్న ప్రత్యామ్నాయం అనేది మాకు తెలుసు.. మీరు కోర్టుని ఆశ్రయిస్తే కమిటీని ఏర్పాటు చేస్తామంటూ రైతులకు సూచించింది సుప్రీంకోర్టు. అయితే, కమిటీ వేయాలని సుప్రీంకోర్టు చేసిన సూచన సమస్యకు ఒక పరిష్కారం కాదని.. చట్టాలను పూర్తిగా ఉపసంహరించాల్సిందేనని రైతు నేతలు చెబుతున్నారు.