బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 30 మార్చి 2021 (14:43 IST)

weight loss: ‘బరువు తగ్గిస్తుందంటూ 33 ఏళ్లుగా అమ్ముతున్న మాత్రలతో గుండెకు ముప్పు’, ఔషధ సంస్థకు రూ. 23 కోట్ల జరిమానా

శరీర బరువు తగ్గించే మాత్ర విషయమై జనాన్ని తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలతో ఫ్రాన్స్‌కు చెందిన సెర్వీర్ అనే ఔషధ సంస్థకు అక్కడి కోర్టు దాదాపు రూ. 23 కోట్ల జరిమానా విధించింది. మీడియేటర్ అనే ఈ మాత్రను అధిక బరువు ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం ఆ సంస్థ తయారుచేసింది. దాదాపు 33 ఏళ్ల పాటు మార్కెట్‌లో దీని అమ్మకాలు కొనసాగాయి. అయితే, ఈ మాత్ర వాడకం వల్ల తీవ్రమైన గుండె సమస్యలు వస్తున్నాయనే ఆందోళనల నడుమ మీడియేటర్ అమ్మకాలను సెర్వీర్ ఆపేసింది.

 
కానీ, అప్పటికే ఈ మాత్ర వాడటం వల్ల దుష్ప్రభావాలకు గురై వందల మంది చనిపోయినట్లు భావిస్తున్నారు. మీడియేటర్ దుష్ప్రభావాల గురించి హెచ్చరికలు ఉన్నా, దాదాపు ఆ మూడు దశాబ్దాల్లో 50 లక్షల మందికి వైద్యులు ఈ మాత్రను సూచిస్తూ వచ్చారు. ఈ మాత్ర విషయమై సెర్వీర్‌పై వేల మంది బాధితులు కలిసి కోర్టును ఆశ్రయించారు. 2019లో ఈ కేసు విచారణ మొదలైంది.

 
మీడియేటర్ దుష్ప్రభావాల గురించి తమకు ఏమాత్రమూ తెలియదని సెర్వీర్ సంస్థ కోర్టుకు తెలిపింది. కానీ, కోర్టు ఆ సంస్థకు దాదాపు రూ.23 కోట్ల జరిమానా విధించింది. ‘‘ఆ మాత్రతో ఉన్న ముప్పు ఏంటో చాలా ఏళ్లుగా వాళ్లకు తెలుసు. కానీ, అవసరమైన చర్యలు వాళ్లు చేపట్టలేదు’’ అని న్యాయమూర్తి సిల్వీ డానిస్ వ్యాఖ్యానించారు. సెర్వీర్ సంస్థ మాజీ ఛైర్మన్‌ జీన్ ఫిలిప్పీ సెటాకు నాలుగేళ్ల సస్పెండెడ్ జైలు శిక్ష విధించారు.

 
ఇటు ఈ వ్యవహారంలో ఫ్రాన్స్ ఔషధ నియంత్రణ సంస్థ పాత్ర కూడా ఉందని, ఆ సంస్థ బాధ్యతల నిర్వహణలో పూర్తిగా విఫలమైందని కోర్టు వ్యాఖ్యానించింది. ఆ సంస్థకు సుమారు రూ.2.5 కోట్ల జరిమానా విధించింది. ఫ్రాన్స్‌కే చెందిన పల్మనాలజిస్ట్ (ఊపిరితిత్తుల నిపుణులు) డాక్టర్ ఇరీన్ ఫ్రాకన్ ఈ ఔషధ దుష్ప్రభావాలను అందరికీ తెలిసేలా చేసిన వ్యక్తిగా పేరు పొందారు. అన్నేళ్ల పాటు ఓ పెద్ద మోసం ఎలా కొనసాగిందనేది ఈ కోర్టు తీర్పుతో అందరికీ అర్థం అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

 
ఇటలీ, స్పెయిన్ సహా చాలా యురోపియన్ దేశాలు 2000ల ఆరంభంలోనే మీడియేటర్‌ను నిషేధించాయి. కానీ, ఫ్రాన్స్‌లో మధుమేహ వ్యాధిగ్రస్తులకు, ఇతరులకు దీన్ని వైద్యులు సూచిస్తూ వచ్చారు. ఆకలిని నియంత్రణలో పెట్టే ఔషధంగా దీన్ని వాడారు. 1976 నుంచి 2009 మధ్య ఈ మాత్ర వేసుకున్నవారు సుమారు 500 మంది మరణించి ఉంటారని ఓ అధ్యయనం అంచనా వేయగా మరో అధ్యయనం 2000 మంది వరకు మరణించి ఉంటారని చెప్పింది.