శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 4 అక్టోబరు 2019 (14:22 IST)

కాలేజీలు మీ సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వకపోతే ఏం చేయాలి?

విద్యా సంవత్సరం ప్రారంభమై, అడ్మిషన్లు పూర్తయ్యే సమయంలో కొందరు విద్యార్థులకు ఒక సమస్య ఎదురవుతుంటుంది. కళాశాల మారాలనుకున్న విద్యార్థులకు ఆయా కాలేజీలు సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటాయి. పూర్తి ఫీజు కడితే తప్ప సర్టిఫికెట్లు వెనక్కి ఇవ్వబోమని కాలేజీ యాజమాన్యాలు చెబుతాయి.

 
ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఎవరికి చెప్పాలో తెలియక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటారు. కొందరు తమకు తెలిసిన వారి ద్వారా పలుకుబడి ఉపయోగించే ప్రయత్నం చేస్తే, కొందరు గత్యంతరం లేక అక్కడే చదువుతారు. అసలు, కళాశాలలు విద్యార్థుల సర్టిఫికెట్లను అలా ఉంచుకోవచ్చా? విద్యార్థి ఒక కాలేజీలో చేరిన తరువాత మనసు మార్చుకుంటే, అప్పుడు ఏం చేయాలి? ఎంత ఫీజు కట్టాలి? ఏఏ సందర్భాల్లో కాలేజీలకు సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వకుండా ఉండే అధికారం ఉంటుంది?

 
దీనిపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), వివిధ విశ్వవిద్యాలయాలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. ఏ కళాశాల అయినా, ఏ సందర్భంలో అయినా విద్యార్థుల సర్టిఫికెట్లు తీసుకోవడం అనేది తప్పు మాత్రమే కాదు, శిక్షించదగ్గ నేరం కూడా.

 
2016 డిసెంబరు 6న యూజీసీ కార్యదర్శి జస్పాల్ సంధు, దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల వీసీలకూ పంపిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దానికి సంబంధించి 2007లోనే యూజీసీ నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా ఆ లేఖలో గుర్తుచేశారు. సర్టిఫికెట్ల విషయంలో ఫిర్యాదులు వస్తే కళాశాల మీద, విశ్వవిద్యాలయాల మీద కఠినమైన చర్యలుంటాయని హెచ్చరించింది యూజీసీ. ఈ నిబంధనల విషయం కాలేజీలు, యూనివర్సిటీల వెబ్‌సైట్లలో పొందుపర్చాలని సూచించింది. ఈ విషయాన్ని అన్ని కళాశాలలకూ చేరవేయాలని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. అయితే, చాలా కాలేజీలు ఈ నిబంధనలు పాటించడం లేదని స్వయంగా యూజీసీ తన ఉత్తర్వుల్లో రాసింది.

 
విద్యాసంస్థలను లాభాల కోసం నడపకూడదని గుర్తు చేసింది. "2012లో యూజీసీ గ్రీవెన్సెస్ రీడ్రస్సల్ రెగ్యులేషన్స్ కింద ఇచ్చిన ఆదేశాలను చాలా విద్యా సంస్థలు పట్టించుకోలేదు. అందుకే ఈ తాజా ఉత్తర్వులు ఇస్తున్నాం. వేర్వేరు సంస్థల్లో చదువుకునే అవకాశం అనే ప్రాథమిక హక్కు విద్యార్థులకు ఉంటుంది. వారికి సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వకపోవడం ఆ హక్కును హరించడమే. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతో పాటు డీమ్డ్ యూనివర్సిటీలకూ వర్తిస్తాయి" అని యూజీసీ స్పష్టంగా చెప్పింది.

 
ఇదే విషయమై ఈ ఏడాది ఫిబ్రవరిలో కాకినాడ జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ తన పరిధిలో ఉన్న అన్ని కళాశాలలకూ ఒక లేఖ రాశారు. వారంలోపు సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేయాలన్న విషయాన్ని ఏఐసీటీఈ కూడా తన హ్యాండ్‌బుక్‌లో ధృవీకరించింది.

 
సర్టిఫికెట్లు కాలేజీలో ఉంచడం గురించి...
అడ్మిషన్ ఫారంతో పాటూ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని విద్యార్థుల మీద ఒత్తిడి చేయకూడదు.
 
అడ్మిషన్ సమయంలో ఒరిజినల్స్ విద్యార్థుల సమక్షంలోనే పరిశీలించి, సంతృప్తి చెందాక తిరిగి ఇచ్చేయాలి. అటెస్టెడ్ కాపీలను కాలేజీలు తమ దగ్గర పెట్టుకోవచ్చు.
 
అడ్మిషన్ రద్దు చేసుకోవాలనుకుంటున్న విద్యార్థిని బ్లాక్‌మెయిల్ చేయడం కోసం సర్టిఫికెట్లను తమ వద్దే ఉంచుకోకూడదని రూల్ నంబర్ 4.1.5 స్పష్టంగా చెబుతోంది.
 
ఒకవేళ ఆ సర్టిఫికెట్లలో తప్పులు లేదా తేడాలున్నట్టు అనుమానం ఉంటే వాటిని ఇచ్చిన బోర్డుతో సరిచూసుకోవాలి. ఆ వివరాలను బట్టి అడ్మిషన్ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు. కానీ, అప్పుడు కూడా సర్టిఫికెట్లను కళాశాలల యాజమాన్యాలు తమ దగ్గర ఉంచుకోకూడదు.

 
ఫీజు తిరిగి ఇవ్వడం గురించి...
ప్రాస్పెక్టస్ కొనమని ఒత్తిడి చేయకూడదు. అందులో ఉన్న సమాచారం అంతా ఉచితంగా అందుబాటులో ఉంచాలి.
మొత్తం కోర్సు ఫీజు అంటే మూడేళ్ల, నాలుగేళ్ల ఫీజు ఒకేసారి వసూలు చేయకూడదు. ఏడాది లేదా సెమిస్టర్ ఫీజు మాత్రమే తీసుకోవాలి.
విద్యార్థి చదువు మధ్యలో కాలేజీ మారడానికి అవకాశం ఉండాలి అని యూజీసీ స్పష్టంగా చెప్పింది.
అడ్మిషన్ వద్దు అనుకున్నప్పుడు ఎన్ని రోజులు ముందు చెబితే, ఫీజు వెనక్కు ఇవ్వాలి?
అడ్మిషన్లకు చివరి రోజు కంటే 15 రోజుల ముందు 100 శాతం వెనక్కు ఇవ్వాలి (10 శాతం వరకూ ప్రొసెసింగ్ చార్జీలు ఆపవచ్చు)
అడ్మిషన్లు ముగిసిన 15 రోజుల లోపు 80 శాతం
అడ్మిషన్లు ముగిసిన 15 రోజుల తరువాత, 30 రోజుల లోపు 50 శాతం
అడ్మిషన్లు ముగిసిన 30 రోజుల తరువాత 0 (ఏమీ ఇవ్వక్కర్లేదు)
కోర్సు ఫీజు, నాన్ ట్యూషన్ ఫీజు కూడా తిరిగి ఇవ్వాలి. (కాషన్ మనీ, సెక్యూరిటీ డిపాజిట్ కాకుండా)
విద్యార్థి అడ్మిషన్ వద్దు అని దరఖాస్తు ఇచ్చిన 15 రోజుల్లో ఈ డబ్బు తిరిగి ఇవ్వాలి.

 
విశ్వవిద్యాలయం బాధ్యత
ప్రతి విశ్వవిద్యాలయం గ్రీవెన్స్ రీడ్రస్సల్ కమిటీని ఏర్పాటు చేయాలి.
విశ్వవిద్యాలయం పరిధిలో ఏ కళాశాల తప్పు చేసినా, అందుకు ఆ విశ్వవిద్యాలయం కూడా బాధ్యత వహించాలి. యూజీసీ దానిపై చర్యలు తీసుకోవచ్చు.
కళాశాలపై ఏ చర్యలు తీసుకున్నారన్న విషయమై యూజీసీకి 20 రోజుల్లో సమాధానం చెప్పాలి.