శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: శనివారం, 13 ఏప్రియల్ 2019 (19:41 IST)

వ్యభిచారం చేస్తేనే నీకు భోజనం... భర్త దారుణం... అక్కడ యువతులకు...

లోక్‌సభ ఎన్నికల రెండో దశలో బిహార్‌లోని సీమాంచల్ ప్రాంతానికి చెందిన మూడు నియోజకవర్గాలు పూర్ణియా, కతిహార్, కిషన్‌గంజ్‌లలో పోలింగ్ జరగబోతోంది. ఈ ప్రాంతాల్లో యువతులను పెళ్లిళ్ల పేరుతో వల వేసి వ్యభిచార వృత్తిలోకి దింపడం నిత్యకృత్యం. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. కతిహార్‌లోని కొందరు వ్యభిచార బాధిత మహిళలను సీతు తివారీ కలిశారు (బాధిత మహిళల పేర్లు మార్చాం).
 
సోనమ్ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. ఇరుగుపొరుగువారు ఓ బ్రోకర్‌తో మాట్లాడి ఆమె పెళ్లిచేశారు. కానీ ఆమెను వ్యభిచారం చేయాలంటూ భర్త ఒత్తిడి చేసేవాడు. కాదంటే కొట్టేవాడు. ఓరోజు తన ఇద్దరు పిల్లలతో కలిసి సోనమ్ కతిహార్‌కు పారిపోయారు. ఇప్పుడు ఆమె ఇక్కడే ఓ కిరాణాషాపు నడుపుకుంటున్నారు.
 
"పెళ్లైన మొదటి సంవత్సరం బాగానే ఉన్నాడు. ఆ తర్వాత వ్యభిచారం చేస్తేనే భోజనం పెడతామని అత్తమామలతో కలసి చెప్పాడు. కాదంటే ఆకలితో మాడిపోవాల్సిందేనన్నారు" అని సోనమ్ చెప్పారు. రాబియాను 30 వేల రూపాయలకు అమ్మేశారు. ఆమె అత్త ఈ ఒప్పందాన్ని కుదిర్చింది, తల్లిదండ్రులు పెళ్లి చేశారు. పెళ్లి అనే ముసుగులో వ్యభిచారకూపంలోకి దిగబోతున్నామని రాబియా, సోనమ్‌లకు తెలియదు. రాబియా కూడా కతిహార్‌కు తన పిల్లలతో కలిసి పారిపోయి వచ్చారు.
 
"బంధువులు, చుట్టుపక్కలవారు మమ్మల్ని ఎంతో అవమానించేవారు. మేమెలా బతుకుతున్నామో మాకు తెలుసు. పెళ్లికొడుకు కుటుంబం గురించి తెలుసుకోకుండా అమ్మాయిలకు పెళ్లి చేస్తే, ఆ అమ్మాయిల జీవితాలు నరకప్రాయమే. అమ్మాయిలెవరూ ఉత్తర్ ప్రదేశ్‌లో అబ్బాయిలతో పెళ్లిళ్లు కుదుర్చుకోవద్దని సూచిస్తున్నా" అని రాబియా అంటున్నారు.
 
అధికారిక లెక్కల ప్రకారం, గత పదేళ్లలో మహిళల అక్రమ రవాణాపై బిహార్ పోలీసులు 753 కేసులు నమోదు చేశారు. 1049 మంది మహిళలను రక్షించారు. "పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో లింగనిష్పత్తిలో వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది. అమ్మాయిల తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపి కొన్ని అక్రమ రవాణా ముఠాలు వారిని పెళ్లి పేరుతో ఈ వ్యభిచార రొంపిలోకి దింపుతుంటాయి" అని బిహార్ అడిషనల్ డీజీపీ వినయ్ కుమార్ తెలిపారు.
 
శిల్పి సింగ్ గత 16 ఏళ్లుగా సీమాంచల్ ప్రాంతంలో ఈ సమస్యపై పోరాడుతున్నారు. భూమికా విహార్ అనే తన సంస్థ 2017లో పదివేల ఇళ్లలో ఓ సర్వే నిర్వహించింది. ఈ ప్రాంతంలో ఎలాంటి విచారణ లేకుండా బ్రోకర్ల ద్వారా 142 పెళ్లిళ్లు జరిగాయి. యూపీలో మహిళల అక్రమ రవాణా ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ఇదొకటి. కానీ దీనిపై ఏ రాజకీయ నాయకుడూ మాట్లాడరు.
 
"బతకడం కోసం పడేపాట్లు అన్నీ ఇన్నీ కావు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న బ్రోకర్లు వారికి డబ్బు ఆశ చూపి వలవేస్తారు. పెళ్లి కుమార్తెల అక్రమ రవాణాపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాలి" అని భూమిక విహార్ సంస్థ డైరెక్టర్ శిల్పి సింగ్ కోరుతున్నారు.
 
అదృష్టం బాగుండి రాబియా, సోనమ్‌లు ఇంటికి వచ్చేశారు. కానీ సీమాంచల్‌లో వీరిలాంటి వేలాదిమంది అమ్మాయిలు పెళ్లిళ్లైన తర్వాత ఎక్కడున్నారనే సమాచారం లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం, బిహార్‌లో ప్రతి 1000 మంది పురుషులకు 918 మంది స్త్రీలున్నారు. కానీ సీమాంచల్‌లో ఇది 927. కేంద్ర, రాష్ట్రాలు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా మహిళా సాధికారత మాత్రం ఇక్కడ ఎక్కడా కనబడదు.