మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (09:13 IST)

కరోనా ఎఫెక్టు : పీఎఫ్ విత్‌డ్రాకు అవకాశం - ఖాతాదారులకు ఊరట

దేశంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఫలితంగా సంపూర్ణ లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ లాక్‌డౌన్ ప్రభావం అన్ని రంగాల వారిపై తీవ్రంగా ఉంది. ముఖ్యంగా అనేక మంది చేతిలో నగదు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సంస్థ ఓ మంచి అవకాశాన్ని కల్పించింది. 
 
వ్యక్తిగత ఆదాయంపై కరోనా వైరస్‌ ప్రభావం పడుతున్న నేపథ్యంలో ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) తమ ఖాతాదారులకు నగదు ఉపసంహరణ అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు ఖాతాదారులందరికీ మొబైల్‌ ఫోన్‌ ద్వారా సందేశాలనూ పంపిస్తోంది. 
 
లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి ఇది నిజంగా ఊరట కలిగించే నిర్ణయం. దేశంలోని అన్ని సంస్థల ఉద్యోగులకు ఈ క్యాష్‌ విత్‌డ్రా అవకాశం ఉంటుంది. మీ ఖాతాలోని సొమ్ములో 75 శాతం లేదా మీ మూడు నెలల బేసిక్‌ సాలరీ, డీఏకు సమానమైన మొత్తాన్ని మీరు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు వుంది.
 
అయితే, పీఎఫ్ ఖాతతా నుంచి తీసుకున్న ఈ మొత్తాన్ని మళ్లీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో ఏదైనా అవసరంతో నగదును ఉపసంహరించుకున్నవారూ మళ్లీ ఈ కరోనా అడ్వాన్స్‌ తీసుకునే వెసులుబాటును కూడా కల్పించారు. ఈ అడ్వాన్స్‌ కోసం ఎలాంటి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లను ఈపీఎఫ్‌వోకు సమర్పించనక్కర్లేదు. విత్‌డ్రా చేసుకున్న సొమ్ము ఆదాయం పన్ను పరిధిలోకి రాదనే విషయాన్ని గ్రహించాలి.
 
కాగా, ఆన్‌లైన్ విత్ డ్రా విధానాన్ని పరిశీలిస్తే, 
* https://unifiedportalmem.epfindia.gov.in/memberinterfaceలోకి లాగిన్‌ కావాలి.
* ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత క్లైయిమ్‌ (మీకు అవసరమైన ఫాం-31, 19, 10సి మరియు 10డీ)ను క్లిక్‌ చేయాలి.
* మీ బ్యాంక్‌ ఖాతా నెంబర్‌లోని చివరి 4 అంకెలను ప్రవేశపెట్టాలి. దాన్ని ధ్రువపరుచుకోవాలి.
* ప్రొసీడ్‌ ఫర్‌ ఆన్‌లైన్‌ క్లైయిమ్‌పై క్లిక్‌ చేయాలి.
* డ్రాప్‌‌డౌన్‌ నుంచి పీఎఫ్‌ అడ్వాన్స్‌ (ఫాం 31)ను ఎంచుకోవాలి.
* డ్రాప్‌‌డౌన్‌ నుంచి 'కరోనా వైరస్‌ ప్రభావం వల్ల' అన్న నగదు ఉపసంహరణ కారణాన్ని ఎంచుకోవాలి.
* కావాల్సిన మొత్తాన్ని ఎంటర్‌ చేయాలి. స్కాన్‌ చేసిన చెక్‌ కాపీని అప్‌లోడ్‌ చేయాలి. మీ చిరునామానూ ఎంటర్‌ చేయాలి.
* 'గెట్‌ ఆధార్‌ ఓటీపీ'పై క్లిక్‌ చేయాలి.
* మీ ఆధార్‌ అనుసంధాన మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయాలి.
* క్లైయిమ్‌ను సమర్పించాలి.