గ్యాస్ వినియోగదారులకు షాక్: సిలిండర్ ధర రూ.1,000 వరకు పెరుగుతుందా?
ఒకవైపు పెట్రోల్ ధరలు.. మరోవైపు గ్యాస్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు రూ.1,000 వరకు పెరుగుతుందని సమాచారం. అయితే, ఎల్‌పిజి సిలిండర్ల ధరలను పెంచడంపై అలాంటి వార్తలేవీ ప్రభుత్వం నుంచి బయటకు రాలేదు.
మీడియా నివేదికల ప్రకారం, ఎల్‌పీజీ సిలిండర్ సబ్సిడీకి సంబంధించి ప్రభుత్వం రెండు స్టాండ్‌లు తీసుకోవచ్చని తెలుస్తోంది. మొదటిది, ప్రభుత్వం ఇప్పుడున్నట్లుగానే నడుస్తుంది. రెండవది, ఉజ్వల పథకం కింద, ఆర్థికంగా బలహీనమైన వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ ఇవ్వాలి.
అయితే, సబ్సిడీ ఇవ్వడం గురించి కేంద్రం స్పష్టంగా ఏమీ చెప్పలేదు. కానీ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు.. పెట్రోల్, డీజిల్ విషయంలో ప్రభుత్వ వైఖరి గమనిస్తే.. రెండో ఆప్షన్ కేంద్రం తీసుకునే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
భారతదేశంలో దాదాపు 29 కోట్ల మందికి ఎల్‌పిజి కనెక్షన్‌లు ఉన్నాయి. ఇందులో ఉజ్జ్వల పథకం కింద దాదాపు 8 కోట్ల LPG కనెక్షన్లు ఉన్నాయి. గడిచిన ఒకటిన్నర సంవత్సరాలలో గ్యాస్ సిలిండర్ ధర రెండింతలు పెరిగింది.