శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (09:30 IST)

వాణిజ్య సిలిండర్ ధర భారీగా పెంపు

దేశంలో వంటగ్యాస్, పెట్రోల్, డీజల్ ధరలు మండిపోతున్నాయి. వీటి ధరలు రోజురోజుకా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నప్పటికీ వారు ప్రభుత్వాలు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పెట్రోల్, డీజల్ ధరలు రోజువారీగా పెంచేస్తున్నారు. తాజాగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను అమాంతం పెంచేశారు. 19 కేజీల వాణిజ్య సిలిండర్‌పై ధరను రూ.273.50కు పెంచేశారు. ఫలితంగా హైదరాబాద్ నగరంలో ఈ సిలిండర్ ధర రూ.2,186 నుంచి రూ.2,460కు చేరింది. 
 
అలాగే, దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈ ధర విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఢిల్లీలో ఈ ధర రూ.2,253కి ఎగబాకింది. గత రెండు నెలల్లో ఈ సిలిండర్ ధరపై ఏకంగా రూ.346 పెరగడం గమనార్హం. కాగా, మార్చి ఒకటో తేదీన రూ.105 పెంచిన చమురు కంపెనీలు 22న రూ.9 పెంచాయి. ఈ సారి ఏకంగా రూ.273.50 చొప్పున పెంచాయి. అయితే, గృహ వినియోగదారులకు మాత్రం చమురు కంపెనీలు ఊరట నిచ్చాయి. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు.