హైదరాబాదులో తొలి గోల్డ్ ఏటీఎంలు.. ఇక షాపులకు వెళ్లక్కర్లేదు..?
డబ్బు డ్రా చేసే ఏటీఎంల గురించి వినివుంటాం. అయితే గోల్డ్ ఏటీఎంల గురించి విన్నారా? అయితే ఈ కథనం చదవండి. గోల్డ్ సిక్కా దేశ వ్యాప్తంగా 3వేల గోల్డ్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
దీంతో బంగారం కొనుగోలు చేయడానికి ఇక దుకాణాలకు వెళ్లవలసిన అవసరం ఏమాత్రం ఉండదు. ఏటీఎంలలో పసిడిని కొనుగోలు చేసే అవకాశం ఈ ఏటీఎంల ద్వారా ఉంటుంది.
వచ్చే 45 రోజుల నుండి 50 రోజుల్లో హైదరాబాద్‌లోని పాతబస్తి, సికింద్రాబాద్, అబిడ్స్ ప్రాంతాల్లో మూడు గోల్డ్ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు గోల్డ్ సిక్కా ప్రకటించింది. అంటే మొదట హైదరాబాద్‌లో గోల్డ్ ఏటీఎంలు ఏర్పాటు కానున్నాయి.
ఈ గోల్డ్ ఏటీఎంల ఏర్పాటు చేయడానికి చెన్నైకు చెందిన టెక్ సంస్థ ట్రూనిక్స్ డేటావేర్, కేఎల్ హై-టెక్ సెక్యూర్ ప్రింట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు గోల్డ్ సిక్కా సీఈవో తరుణ్ అన్నారు.
ఈ గోల్డ్ ఏటీఎంల నుండి ఒకేసారి 0.5 గ్రాముల నుండి 500 గ్రాముల వరకు బంగారాన్ని నాణేల రూపంలో కొనుగోలు చేయవచ్చు. ఇందుకు డెబిట్, క్రెడిట్ కార్డులు లేదా ఈ సంస్థ జారీ చేసే ప్రీపెయిడ్ కార్డులను ఉపయోగించవచ్చు.