సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , మంగళవారం, 30 మే 2017 (03:59 IST)

భారత్‌లో డిగ్రీ చదివిన మహిళల్లో 65 శాతం మంది పని చేయడం లేదా.. అయినా వృద్ధి రేటులో మనమే ఫస్ట్ అట

దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ప్రస్తుతం చాలా తక్కువగా ఉందని వీరి సంఖ్య బాగా పెరగాల్సిన అవసరం ఉందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ప్రపంచ బ్యాంకు సీనియర్‌ ఆర్థికవేత్త ఫ్రెడరికో గిల్‌ శాండర్‌ వృద్ధిలో మహ

దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ప్రస్తుతం చాలా తక్కువగా ఉందని  వీరి సంఖ్య బాగా పెరగాల్సిన అవసరం ఉందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ప్రపంచ బ్యాంకు సీనియర్‌ ఆర్థికవేత్త ఫ్రెడరికో గిల్‌ శాండర్‌ వృద్ధిలో మహిళల పాత్ర గురించి మాట్లాడుతూ. ‘‘భారత్‌లో డిగ్రీ చదివిన మహిళల్లో 65 శాతం మంది పని చేయడం లేదు. ఈ రేటు బంగ్లాదేశ్‌లో 41 శాతం, ఇండోనేషియా, బ్రెజిల్‌లో 25 శాతంగానే ఉంది. భారత్‌ మరిన్ని ఉద్యోగాలు కల్పించాలి. వేతన ఉద్యోగాలను విస్తృతం చేయాలి. అలాగే, భద్రతతో కూడిన పరిస్థితులను కల్పించడం ద్వారా పని ప్రదేశాల్లో లింగ అసమానత్వాన్ని తగ్గించాలి’’ అని సూచించారు.
 
2016 చివరలో పెద్దనోట్ల రద్దుపై తీసుకున్న నిర్ణయం భారత్ వృద్ధికి విఘాతం కలిగించినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఇకముందూ తన ప్రయాణం సాగిస్తుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ 2017–18 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేసింది. పైగా 2019–20 నాటికి 7.7 శాతం వద్ధి రేటుకు చేరుకుంటుందని బ్యాంకు దేశీయ డైరెక్టర్‌ జునైద్‌ అహ్మద్‌ వివరించారు.
 
బలమైన ఫండమెంటల్స్, పెట్టుబడుల తీరు మెరుగుపడుతుండడం, సంస్కరణల వాతావరణాన్ని సానుకూలతలుగా పేర్కొంది. మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచితే రెండంకెల వృద్ధి రేటు సాధన దిశగా సాగిపోవచ్చనీ సూచించింది. ఈ మేరకు ‘ఇండియా డెవలప్‌మెంట్‌ రిపోర్ట్‌’ను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. గతేడాది చక్కని వర్షపాతం తర్వాత పరిస్థితులు మెరుగుపడుతుండగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం భారత వృద్ధికి విఘాతం కలిగించిందని ప్రపంచ బ్యాంకు వివరించింది. 
 
దీంతో గత ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతంగా జీడీపీ రేటు ఉండొచ్చని తెలిపింది. ‘‘భారత్‌ ఇకపైనా ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. జీఎస్టీ అమలు ప్రోత్సాహాన్ని ఇవ్వనుంది’’ అని  బ్యాంకు దేశీయ డైరెక్టర్‌ జునైద్‌ అహ్మద్‌ తెలిపారు.
 
కాగా, మే 19 నాటికి వ్యవస్థలోకి నగదు తిరిగి ప్రవేశపెట్టడం (రీమోనిటైజేషన్‌) 80 శాతానికి చేరిందని ఎస్‌బీఐ తెలిపింది. ‘‘గతేడాది నవంబర్‌ 8 నుంచి ఈ ఏడాది మే 12 వరకు వ్యవస్థలోకి రూ.7 లక్షల కోట్ల డిపాజిట్లు వచ్చాయని అంచనా వేస్తున్నట్టు బ్యాంకు వివరించింది. మెరుగైన జీడీపీ గణాంకాలకు తోడు సరిపడా లిక్విడిటీ, నెమ్మదించిన ద్రవ్యోల్బ ణంతో ఆర్‌బీఐకి ద్రవ్య విధాన నిర్వహణ క్లిష్టంగా మారిందని ఈ నివేదికను రూపొందించిన ఎస్‌బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్‌ పేర్కొన్నారు.