ఎయిర్ ఫైబర్ యూజర్లకు జియో శుభవార్త ... రూ.1000 ఇన్‌స్టలేషన్ చార్జీ మాఫీ!!
ఎయిర్ ఫైబర్ యూజర్లకు జియో శుభవార్త చెప్పింది శుక్రవారం నుంచి అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. జియో ఫ్రీడమ్ ఆఫర్ కింద సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకుని రానుంది. ఈ ఆఫర్ కింద ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు ఇన్‌స్టలేషన్ చార్జీ రూ.1000ని మాఫీ చేసింది. ఈ ఆఫర్ జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ఉంటుందని తెలిపింది. కొత్త కనెక్షన్ పొందాలనుకునేవారికి ఈ ఆఫర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, ఇప్పటికే కనెక్షన్ తీసుకున్న వినియోగదారులతో పాటు కొత్త కనెక్షన్‌కు బుక్ చేసుకునేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.
ఫ్రీడమ్ ఎయిర్ ఫైబర్ ఆఫర్ కింద కొత్త యూజర్లకు ఏకంగా 30 శాతం రాయితీ లభిస్తుందని జియో వెల్లడించింది. జూన్ 26 తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు కొత్తగా చేరే కస్టమర్లకు ఇన్‌స్టలేషన్ చార్జీలు రూ.1000 మాఫీ అవుతాయని తెలిపింది. 3, 6, 12 నెలల 5జీ, 5జీ ప్లస్ ప్లాన్లను ఎంచుకునే నూతన వినియోగదారులు అందరికీ జీరో ఇన్‌స్టలేషన్ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. అయితే, జియో ఫ్రీడమ్ ఆఫర్ 3 నెలల ఆల్ ఇన్ వన్ ప్లాన్‌కు ప్రస్తుతం రూ.3121 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.,1000 ఇన్‌స్టలేషన్ చార్జీలు కలిసివుంటాయి. ఇపుడు కొత్తగా కనెక్షన్ తీసుకుంటే రూ.వెయ్యి మాఫీకాగా మిగిలిన రూ.2121 చెల్లించాల్సి ఉంటుందని జియో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పర్కొంది.