శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (17:21 IST)

ఎల్ఐసీ ఏజెంట్ల మోసాలు.. పాలసీదార్లు బతికున్నా చనిపోయారని..?

ఎల్‌ఐసీ పాలసీలను తీసుకున్న పాలసీదార్లు బతికున్నా చనిపోయారంటూ తప్పుడు ధృవపత్రాలు సృష్టించి సొమ్ములు కాజేసిన ఘటనలో ప్రధాన సూత్రదారులు తమ ఆస్తులను చక్కబెట్టుకునే ప్రయత్నం చేసారు. వాటిని అధికారులు జప్తు చేయకముందే మరొకరి పేరుతో బదలాయించారు. ఈ కుంభకోణంలో పాలుపంచుకున్న ఏజెంట్లు కూడా ఈ తరహానే అనుసరించారు. 
 
సూర్యాపేట జిల్లా కోదాడ ఎల్‌ఐసీ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి బీకూనాయక్‌ ఏజెంట్లతో ఒప్పందం కుదుర్చుకుని ఈ మోసానికి పాల్పడ్డాడు. ఈ మోసాన్ని సంస్థ అంతర్గత ఆడిట్‌లో గతేడాది డిసెంబరు 18న గుర్తించగా, బాధ్యులైన ఉద్యోగి బీకూనాయక్‌తో పాటు, ఐదుగురు ఏజెంట్లపై చర్యలు తీసుకున్నారు. ఈ కుంభకోణంపై ఎల్‌.ఐ.సి. విజిలెన్స్‌ విభాగం అంతర్గత విచారణ జరుపుతోందని, నివేదిక అందిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అధికారులు చెబుతూ వచ్చారు. 
 
ఈ జాప్యాన్ని అదునుగా చేసుకున్న నిందితులు ఆస్తులను బదలాయించారు. తప్పుడు మార్గంలో వారు బదలాయించడానికి ప్రయత్నించిన ఆస్తుల వివరాలను పరిశీలిస్తే, ప్రధాన సూత్రధారి బీకూనాయక్‌ కోదాడ పనిచేసే సమయంలో పట్టణంలోని మూడు ప్రాంతాల్లో మూడు ఇంటి ప్లాట్లు కొనుగోలు చేశారు. వీటిలో రెండు ఆయన పేరు మీద, మరొకటి అతని భార్య పేరిట రిజిస్ట్రేషన్‌ చేసారు. 
 
ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆయన కొనుగోలు చేసిన సమయంలో వాటి విలువ రూ.13.54 లక్షలు. బహిరంగ మార్కెట్‌లో రూ.అరకోటిపైగా విలువ చేస్తాయి. పక్కా ప్రణాళికతో ఆస్తులను తన తమ్ముడి పేరిట బదలాయించారు. పట్టణంలో వాటర్ ట్యాంకు వద్ద ఉన్న 288.88 గజాలు భూమి ఆయన పేరుమీద, అక్కడే ఆయన భార్య సబిత పేరిట మరో 288 గజాల స్థలం ఉంది. దానిని కూడా మార్చి 13న సోదరుడు హుస్సేన్‌నాయక్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారు. 
 
భవానీనగర్‌ సమీపంలోని 324 గజాల స్థలాన్ని రూ.4.86 లక్షలకు వెచ్చించి 2016లో హజీనాయక్‌ వద్ద బీకూనాయక్‌ కొన్నారు. దీనిని కూడా తన తమ్ముడి పేరిట బదలాయించాడు. నెలల కాలంగా అజ్ఞాతంలో గడిపిన బీకూనాయక్‌ రిజిస్ట్రేషన్ చేయించడానికి బయటకు వచ్చాడు. తోటి ఏజెంట్ల స్థలాలను ఇదే విధంగా చేయాలనుకుని డాక్యుమెంట్ రైటర్‌ని ఆశ్రయించాడు. 
 
రైటర్ ఈ విషయాన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే రిజిస్ట్రేషన్ ఆపాలని ఆదేశించారు. ఎల్‍‌ఐసీ అధికారులు అతని ఆస్తులపై నిషేధం విధించి క్రయవిక్రయాలకు తావు లేకుండా చేయాలని అధికారులను అభ్యర్థించారు. కానీ ఈ విషయం తెలియని కార్యాలయ సిబ్బంది లావాదేవీలు జరిపించారు. ఇప్పుడు తమ చేతుల్లో లేదని చెప్పేశారు.