ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (20:14 IST)

కన్‌స్ట్రక్షన్ కెమికల్ మార్కెట్‌ విస్తరణ దిశగా నిప్పాన్ పెయింట్స్...

nippon paints
దేశంలో పెయింట్ల తయారీ కంపెనీల్లో లీడింగ్ ప్లేయర్‌గా ఉన్న నిప్పాన్ పెయింట్స్ తాజాగా కన్‌స్ట్రక్షన్ కెమికల్ మార్కెట్‌ను విస్తరించే దిశగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం రూ.12,500 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ విషయాన్ని నిప్పాన్ పెయింట్స్ ఇండియా డెకెరేటివ్ ప్రెసిడెంట్ మహేష్ ఆనంద్ మంగళవారం చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
 
ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, నిజానికి ఈ మార్కెట్‌లో గత నాలుగేళ్లుగా సేవలు అందిస్తున్నప్పటికీ ఇపుడు భారీ స్థాయిలో పెట్టుబడులుపెట్టి తమ మార్కెట్‌ను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. ఇందుకోసం విదేశాలకు చెందిన వాల్ట్రాన్, సెల్లీస్, వీటెక్ వంటి వాటిని కొనుగోలు చేశామన్నారు. ఇవన్నీ నిప్పాన్ పెయింట్స్ ఇండియా గొడుగు కిందే పని చేస్తాయని ఆయన వివరించారు. 
 
కన్‌స్ట్రక్షన్ కెమికల్స్ మార్కెట్ విస్తరణలోభాగంగా, డ్రై మిక్స్, రిపైర్, మెయింటినెన్స్, కన్‌స్ట్రక్షన్ కెమికల్, వాటర్‌ప్రూఫింగ్ వంటి విభాగాల్లో సేవలు అందిస్తామని తెలిపారు. ముఖ్యంగా, నిర్మాణ దశలో కాంక్రీట్ అడ్మిక్చర్స్, మెంబ్రేన్స్, పోస్ట్ కన్‌స్ట్రక్షన్ దశలో కాంక్రీట్ రిపేర్, వాటర్ ప్రూఫింగ్,  హైబ్రిడ్ సీలంట్స్, రిపేర్ అండ్ మెయింటినెన్స్ విభాగంలో ప్రొటెక్టివ్ కోటింగ్, సీలెంట్స్, వాటర్ ప్రూఫింగ్ పనులు చేస్తామని తెలిపారు. 
 
ఈ మార్కెట్‌ను ద్వితీయ, తృతీయ నగరాల్లోని తమ ఆధీకృత డీలర్ల ద్వారా విస్తరించేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ప్రస్తుతం పెయింట్స్ రంగం ఏమంత ఆశాజనకంగా లేదన్నారు. ఉత్పత్తికి తగిన విధంగా డిమాండ్ లేదన్నారు. అదేసమయంలో ఇటీవలి కాలంలో పెయింట్స్ ధరలు కూడా 10 నుంచి 20 శాతం మేరకు పెరిగాయని ఆయన తెలిపారు.