1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 మే 2021 (09:02 IST)

ఆగని పెట్రో బాదుడు... మే నెలలో చమురు ధరలు ఎన్నిసార్లు పెరిగాయంటే...

దేశాన్ని కరోనా వైరస్ అల్లకల్లోలం చేస్తోంది. దీంతో కోట్లాది మంది ప్రజలు ఆర్థికస్థితి చితికిపోయింది. అయినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని చమురు సంస్థలు మాత్రం ఏమాత్రం కరుణ చూపించడం లేదు. పెట్రోల్ ధరల పెంపును కొనసాగిస్తూనే ఉన్నాయి. 
 
ఇటీవల కాలంలో నిత్యం పెరుగుతున్న చమురు ధరలతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. అంతకుముందు ఆదివారం ఇంధన ధరలు పెరిగాయి. అయితే.. ఒక రోజు విరామం తర్వాత చమురు కంపెనీలు ధరలను మళ్లీ ధరల బాదును ప్రవేశపెట్టాయి. 
 
ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో సెంచరీ కొట్టాయి. తాజాగా చమురు కంపెనీలు పెట్రోల్‌ లీటర్‌కు 23 పైసలు, డీజిల్‌ లీటర్‌కు 27 పైసల వరకూ పెంచాయి.
 
తాజాగా పెంచిన ధరల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.44 కి చేరగా.. డీజిల్‌ లీటర్ రూ.84.32కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబై నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర వందకు చేరువైంది. పెట్రోల్‌ రూ.99.71, డీజిల్‌ రూ.91.57కు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.93.49, డీజిల్‌ రూ.87.16 కి పెరిగింది. చెన్నైలో పెట్రోల్‌ రూ.93.49, డీజిల్‌ 87,16కు చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.97.12, డీజిల్‌ రూ.91.92కు చేరింది. విజయవాడలో పెట్రోల్ ధర 99.77 ఉండగా.. డీజిల్ ధర 93.96 కి పెరిగింది.
 
మరోవైపు, పలు రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర రూ.100ను దాటేసింది. మే నెలలో (25 రోజుల్లో ) ఇప్పటివరకు 13 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఇప్పటివరకు పెట్రోల్‌పై దాదాపు రూ.2.80, డీజిల్‌పై రూ.3పైగా పెంచాయి. పెట్రోల్ రిటైల్ అమ్మకపు ధరలో 60 శాతం, డీజిల్‌లో 54 శాతానికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ.32.90, డీజిల్‌పై రూ .11.80 వసూలు చేస్తోంది.