ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 5 జనవరి 2019 (09:11 IST)

కేంద్రం షాక్ : రూ.2 వేల నోటు ముద్రణ నిలిపివేత

దేశ ప్రజలకు కేంద్రం షాకిచ్చింది. రూ.2 వేల నోటు ముద్రణను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ట్వీట్ చేశారు. ఆర్థిక వ్యవస్థలో రూ.2 వేల నోట్లు తగిన స్థాయిలో ఉన్నందున ప్రస్తుతానికి వాటి ముద్రణను నిలిపివేసినట్లు ఆయన తెలిపారు.
 
ప్రస్తుతం దేశంలో రూ.2 వేల నోటు చలామణిలో ఉంది. ఈ నోటును కూడా చలామణి నుంచి తీసేస్తారంటూ సాగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. భవిష్యత్తు అవసరాలను అంచనా వేసి కరెన్సీ నోట్ల ముద్రణకు ప్రణాళిక రచిస్తామన్నారు. 'మన వ్యవస్థలో అవసరమైన దానికన్నా ఎక్కువ మొత్తంలో రెండు వేల నోట్లు ఉన్నాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో విలువపరంగా చూస్తే, 35 శాతానికి పైగా వాటా రెండు వేల నోట్లదే. రెండు వేల నోట్ల ముద్రణ విషయంలో ఇటీవల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు' అని చెప్పారు. 
 
కాగా, దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలో నల్లధనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్ల ముద్రణను నిలిపివేసిన విషయం తెల్సిందే. పెద్ద నోట్ల రద్దు సమయంలో మన ఆర్థిక వ్యవస్థలో దాదాపు 86 శాతం వాటా రూ.100, రూ.500 నోట్లదే కావడం గమనార్హం.