ఈ రైలులో ప్రయాణికులు ఉచితంగా సినిమాలు చూడవచ్చు...
భారతీయ రైల్వే శాఖ ఇప్పటికే వేలాది రైల్వే స్టేషన్‌లలో ఉచిత వైఫై సౌకర్యాలను ప్రయాణికులకు కల్పించింది. తాజాగా ఒక అడుగు ముందుకు వేసి రైళ్లలో ప్రయాణించేటప్పుడు సైతం ఈ సౌకర్యాన్ని కల్పించనుంది. కాచిగూడ-కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే వారు వైఫై సాయంతో తమ ప్రయాణంలో నిరంతరాయంగా సినిమాలు చూడవచ్చు.
ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా మిషన్ కార్యక్రమంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే కొత్తగా మేజిక్ బాక్స్‌ను ప్రవేశపెట్టింది. శతాబ్ది, ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్, లక్నో ఎక్స్‌ప్రెస్‌లలో మాదిరిగానే వైఫై ఎన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టమ్ సాయంతో ప్రయాణికులు తమ పర్సనల్ డివైజ్‌లలో ఉచితంగా సినిమాలను వీక్షించవచ్చని రైల్వే అధికారులు ప్రకటించారు.
ఈ ఉచిత వైఫైను కాచిగూడ- కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లోని ఐదు ఏసీ బోగీల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. కాగా ఈ మేజిక్ బాక్స్ నుండి సినిమాలను డౌన్‌లోడ్ చేసుకునే వీలు లేదు. అభ్యంతరకరమైన దృశ్యాలను ప్రయాణికులు చూడకుండా ఉండటంతో పాటుగా ఉచిత వైఫైని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు రైల్వే అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.