రైలు ప్రయాణికులకు ఊరట : టిక్కెట్ రద్దు గడువు పెంపు
భారతీయ రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు కాస్త ఊరటనిచ్చే వార్తను చెప్పింది. గత యేడాది మార్చి 21 - జూన్ 31 మధ్య రైల్వే కౌంటర్లలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఇది ఎంతో శుభవార్త. లాక్డౌన్ కారణంగా అప్పట్లో రైళ్లు రద్దు కావడంతో దేశవ్యాప్తంగా సేవలన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.
దీంతో రైలు టికెట్లు తీసుకున్న ప్రయాణికులు వాటిని రద్దు చేసుకునేందుకు ఆరు నెలల గడువు ఇచ్చింది. ఇప్పుడు ఆ సమయాన్ని మరో మూడు నెలలు పెంచి తొమ్మిది నెలలు చేసింది. ప్రయాణికులు తమ టికెట్లను బుక్ చేసినప్పటి నుంచి 9 నెలల్లోపు ఎప్పుడైనా తమ టికెట్లను రద్దు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే, ఇది ప్రభుత్వం రద్దు చేసిన సాధారణ షెడ్యూల్డ్ రైలు ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
కరోనా కారణంగా రిజర్వేషన్ కౌంటర్ల వద్ద కొద్దిమందిని మాత్రమే అనుమతించడంతో ప్రభుత్వం ఇచ్చిన ఆరు నెలల గడువులో చాలామంది ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకోలేకపోయారు.
ఈ నేపథ్యంలో గడువును మరింత పెంచాలన్న అభ్యర్థనలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టికెట్లు రద్దు చేసుకునే ప్రయాణికులకు పూర్తి మొత్తాన్ని చెల్లించనున్నారు.