గురువారం, 18 జులై 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్

తెలంగాణాలో ఉద్యోగ జాతర - 2910 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్

jobs
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ జాతర ప్రారంభంకానుంది. మొత్తం 2910 పోస్టుల భర్తీకి రూట్ క్లియర్ అయింది. ఇందులో 663 గ్రూపు-2 పోస్టులు, 1373 గ్రూపు-3 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీ కోసం ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. 
 
దీనిపై ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో 50 వేల మైలురాయిని అధికమించినట్టు వెల్లడించారు. వీటి భర్తీకి త్వరలోనే నోటఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వేగంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామన్నారు. గత మూడు నెలల్లోనే 52,460 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. మరిన్ని ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ జారీచేస్తామని తెలిపారు. 
 
కాగా, ఇపుడు కొత్తగా భర్తీ చేయనున్న ఉద్యోగాల వివరాలను పరిశీలిస్తే, గ్రూపు-2 ఉద్యోగాల్లో జీఏడీ ఏఎస్‌లో 165, పంచాయతీ రాజ్ ఎంపీవో పోస్టులు 125, డిప్యూటీ తాహశీల్దారు  పోస్టులు 98, ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులు 97, అసిస్సెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు 59 చొప్పున ఉన్నాయని తెలిపారు. 
 
గ్రూపు-2 ఉద్యోగాల్లోని 38 చేనేత ఏడీవో, 25 ఆర్థిక శాఖ ఏఎస్వో, 15 అసెంబ్లీ ఏఎస్‍వో, 14 గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్, 11 గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్, తొమ్మిది ఏఎల్‌వో, ఆరు న్యాయశాఖ ఏఎస్‌వో పోస్టులు ఉన్నాయి. 
 
అలాగే, గ్రూపు-3 ఉద్యోగాల్లో మొత్తం 99 విభాగాధిపతులు పరిధిలోని 1373 జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌటెంట్, ఆడిటర్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయని తెలిపారు.