శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జూన్ 2022 (12:00 IST)

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ఆరోగ్య మంత్రి హరీష్ రావు

harish rao
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖామంత్రి హరీష్ రావు శుభవార్త చెప్పారు. తెలంగాణ వైద్యారోగ్య శాఖలో త్వరలో 1,326 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని మెడికల్ బోర్డును ఆయన ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. 
 
ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, డీఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. వైద్యారోగ్య శాఖలో మొత్తం 12,755 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించగా.. తొలి దశలో 1,326 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని మెడికల్‌ బోర్డును ఆదేశించారు. ఇందుకోసం ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
 
వైద్య ఆరోగ్య విభాగం, టీవీవీపీ, వైద్య విద్య, ప్రజారోగ్యం విభాగాల్లో భర్తీ చేయనున్న ఈ 1,326 పోస్టుల్లో.. టెక్నికల్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేయనున్నారు. నిమ్స్‌లోని ఖాళీలు నిమ్స్ బోర్డు ద్వారా, ఆయుష్ సహా మిగతా అన్ని పోస్టులను మెడికల్ నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. 
 
కరోనా కాలంలో సేవలందించిన ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగాల భర్తీలో 20 శాతం వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి పేర్కొన్నారు. ఆయుష్ వైద్యులను టీచింగ్ స్టాఫ్‌గా మార్చే ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, ఆయుష్ సర్వీసులో మార్పులు చేసి కొత్త పోస్టులు భర్తీ చేయాలని చెప్పారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ద్వారా పని చేసే వారి వివరాలు వెంటనే ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.