శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (20:28 IST)

కారణజన్ముడు ఎన్.టి.రామారావు : గుడిమెట్ల చెన్నయ్య

gudimetla chennaih
తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానటుడు ఎన్టీఆర్ కారణజన్ముడు అని జనని సంస్థ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య  కొనియాడారు. ఆదివారం పెరంబూరు తెలుగు సాహితీ సమితి ఆధ్వర్యంలో అనన్య సామాన్య ధారావాహిక ఉపన్యాస కార్యక్రమం 97వ ప్రసంగం జరిగింది. స్థానిక పెరంబూరులోని డి.ఆర్.బి.సి.సి.సి. మహోన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగింది. తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని నలుదిశలా చాటిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని "విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు - శ్రీ నందమూరి తారక రాముడు" అనే అంశంపై ఏర్పాటైన ఈ ఉపన్యాస కార్యక్రమం జరిగింది. 
 
ఇందులో ప్రధాన వక్తగా పాల్గొన్న గుడిమెట్ల చెన్నయ్య మాట్లాడుతూ, వెండి తెరపై నవరసాలు పండించిన మహానటుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన ఏ పాత్ర వేసిన అందులో ఒదిగిపోయి నటించారని, రాముడు పాత్ర వేస్తే రాముడిగా, కృష్ణుడు పాత్రవేస్తే శ్రీకృష్ణుడుగా అచ్చుగుద్దినట్టు ఉండేవారన్నారు. దీంతో అశేష ప్రజాభిమానులను ఎన్టీఆర్ సంపాదించుకున్నారని వ్యాఖ్యానించారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆ మహామనిషి శత జయంతి సందర్భంగా పెరంబూరు తెలుగు సాహితీ సమితి ద్వారా స్మరించుకోవటం తమ అదృష్టమన్నారు. 
 
ఎన్టీఆర్ తెలుగు నేలపై ప్రభవించడం తెలుగువారిగా మనందరి అదృష్టమన్నారు. కృషి, దీక్ష, పట్టుదలకు ప్రతీకగా, నియమ నిష్టలకు, క్రమశిక్షణకు మారుపేరుగా ఆఖరి క్షణం వరకు జీవితాన్ని సాగించిన మహావ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొంటూ ఆయన నటించిన చిత్రాలు విశేషాలు, పాటలు ఆలపిస్తూ సభికులను ఆకట్టుకున్నారు. 
 
కాగా, ఈ కార్యక్రమానికి పెరంబూరు తెలుగు సాహితీ సమితి అధ్యక్షులు తమ్మినేని బాబు అధ్యక్షత వహించగా, కార్యదర్శి డాక్టర్ టి.ఆర్.ఎస్.శర్మ (శ్రీలక్ష్మీప్రియ) స్వాగత పలుకులు పలుకగా, వక్తను వసుంధర దేవి పరిచయం చేసి ప్రార్థనాగీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వక్తను సమితి తరపున తమ్మినేని బాబు, టి.ఆర్.ఎస్.శర్మతోపాటు గాయకులు కిడాంబి లక్ష్మీకాంత్, తెలుగు ప్రముఖులు ఎన్. వి.విజయ సారథి, వంజరపు శివయ్య  శాలువలతో సత్కరించారు. నాటక కళాకారులు కాకాణి వీరయ్య, అంబ్రూనీ, మాస్ సంస్థ అజరత్తయ్య తదితరులు పాల్గొన్నారు.