కరోనా మరణాల్లో 73 శాతం అనారోగ్యులే : లవ్ అగర్వాల్
ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువలో ఉన్నాయి. అయితే, దేశంలో ఇప్పటివరకు చనిపోయిన కరోనా రోగుల్లో 73 శాతం మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారేనని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
ఇదే అంశంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, దేశంలో కరోనా మరణాల శాతం తక్కువగా ఉందన్నారు. గత 24 గంటల్లో 3,708 మంది డిశ్చార్జ్ అయ్యారని, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని తెలిపారు.
కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య 48.07 శాతం ఉందని, కరోనా మరణాల్లో 73 శాతం మందికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయన్నారు. కరోనాపై పోరాటంలో టెలీమెడిసిన్ ఎంతో ఉపయోగకరమని, ప్రజలంతా రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని లవ్ అగర్వాల్ సూచించారు.
ఇకపోతే, దేశంలో కరోనా మరణాల సంఖ్య 2.82 శాతంగా ఉందని, ప్రపంచంలోనే ఇండియాలో కరోనా మరణాల సంఖ్య తక్కువని, ఇది ఊరట కలిగించే అంశమన్నారు. భారత్‌లో 2 లక్షలకు చేరువలో కరోనా కేసులున్నాయని, కోలుకుంటున్నవారి సంఖ్య లక్షకు చేరువలో ఉందన్నారు. అలాగే, ప్రతి రోజూ దేశంలో రోజుకు లక్షా 20 వేల కరోనా టెస్టులు చేస్తున్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది.