సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (11:19 IST)

దేశంలో కోటికి చేరువగా కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కోటికి చేరువగా వస్తున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో ఆదివారం 30 వేలకుపైగా నమోదవగా, సోమవారం 27 వేల కేసులు రికార్డయ్యాయి. ఇది ఆదివారం కంటే 10.5 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. 
 
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 27,071 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 98,84,100కు చేరింది. ఇందులో 93,88,159 మంది మహమ్మారి నుంచి బయటపడగా, 3,52,586 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. 
 
మరో 1,43,355 మంది కరోనా బారినపడి మరణించారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 30,695 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని, మరో 336 మంది బాధితులు చనిపోయారని ప్రభుత్వం వెల్లడించింది.
 
కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి డిసెంబర్‌ 13 వరకు మొత్తం 15,45,66,990 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. ఇందులో నిన్న ఒకేరోజు 8,55,157 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 384 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది. 
 
వీటిలో 101 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వెలుగుచూశాయి. ఆదివారం కరోనా బారినపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి ఇప్పటి వరకు ఈ మహమ్మారికి బలైన వారి సంఖ్య 1,496కు పెరిగింది.
 
ఇక కొవిడ్‌కు చికిత్స పొందుతూ ఆదివారం 631 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారి నుంచి బయటపడిన వారి సంఖ్య 2,69,232కు చేరుకుంది. 
 
రాష్ట్రంలో ఇప్పటి వరకు 61,57,683 నిర్ధారణ పరీక్షలు చేయగా, గత రాత్రి 8 గంటల వరకు 28,980 మందిని పరీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 7,380 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరిలో 5,298 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.