బుధవారం, 13 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (10:03 IST)

వర్మను కాటేసిన 'కరోనా వైరస్' కలెక్షన్లు... థియేటర్లలో కనిపించని ప్రేక్షకులు

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్వయంగా కథను సమకూర్చిన చిత్రం కరోనా వైరస్. ఈ చిత్రానికి అగస్త్య మంజు దర్శకత్వం వహించగా, వర్మనే స్వయంగా నిర్మించారు. 
 
కరోనా లాక్డౌన్ తర్వాత అంటే ఎనిమిది నెలల తర్వాత సినిమా హాల్స్ తెరుచుకున్నాయి. ఈ థియేటర్లు తిరిగి తెరుచుకున్న తర్వాత విడుదలైన తొలి చిత్రం ఈ కరోనా వైరస్. గత వారం ఈ సినిమా విడుదల కాగా, తొలి రోజు కలెక్షన్లు అత్యంత ఘోరంగా నిలిచాయి.
 
సినీ ప్రేక్షకులకు, థియేటర్ యాజమాన్యాలకు షాకిస్తూ, తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున కేవలం రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకూ మాత్రమే కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోంది. 
 
లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో ఓ ఇంట్లోని వారిని కరోనా వైరస్ ఎలా భయపెట్టిందన్న కథాంశంతో ఈ చిత్రం తయారైంది. ఈ సినిమా ప్రపంచంలోనే కరోనాపై తీసిన తొలి చిత్రమని వర్మ ఎంతగా ప్రచారం చేసుకున్నా, ఒక్కో థియేటర్‌లో పదుల సంఖ్యలో కూడా ప్రేక్షకులు లేరని సినీ విశ్లేషకులు అంటున్నారు.
 
ఇకపోతే, ఈ నెల 25వ తేదీన క్రిస్మస్ పండుగ సందర్భంగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రొమాంటిక్ డ్రామా 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రేక్షకులను మళ్లీ థియేటర్ల వైపు రప్పిస్తుందని యాజమాన్యాలు భావిస్తున్నాయి. చిత్ర యూనిట్‌తో పాటు.. హీరో కూడా గంపెడాశలు పెట్టుకునివున్నాడు.