శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (10:22 IST)

భారత్‌లో మృత్యుఘోష : ఒకే రోజు 2 వేల మంది మృతి

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే దేశంలో మృత్యుఘోష వినిపిస్తోంది. 
 
గత కొన్ని రోజుల నుంచి రెండు లక్షలకు పైగా నమోదవుతున్న కేసులు కాస్త.. మూడు లక్షల మార్క్ దాటింది. ఈ మహమ్మారి కారణంగా మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. గత 24 గంటల్లో బుధవారం కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా 2,102 మంది మరణించారు. 
 
దేశంలో కోవిడ్ ప్రారంభం నాటినుంచి అత్యధిక మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. దీంతోపాటు గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,15,925 కేసులు నమోదయ్యాయి. కేవలం 17 రోజుల్లోనే రోజువారి కేసులు లక్ష నుంచి 3 లక్షలకు చేరడం ఈ మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతోంది.
 
మరోవైపు, కరోనా సెకండ్ వేవ్ అలజడి సృష్టిస్తోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుండగానే.. మరోవైపు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ మేరకు పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. 
 
ఈ క్రమంలో దేశవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. పలుచోట్ల ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితులు మరణిస్తున్నారు. మరోవైపు కరోనా చికిత్సలో అత్యవసరంగా ఉపయోగించే రెమిడెసివిర్ ఔషధం కొరత కూడా వేధిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఆక్సిజన్, ఔషధాల కొరత ఏర్పడకుండా నిరంతరం చర్యలు తీసుకుంటోంది.