గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (08:36 IST)

"బ్రేక్ ది కరోనా చైన్" : మరిన్ని కఠిన ఆంక్షల్లో మహారాష్ట్ర

మహారాష్ట్రలో మహా ప్రళయం సంభవించింది. కరోనా వైరస్ పేరుతో వచ్చిన ప్రళయం దెబ్బకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి దెబ్బకు రాష్ట్రం వణికిపోతోంది. ఈ క్రమంలో ఈ కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కఠిన ఆంక్షలు విధించింది. ‘బ్రేక్‌ ద చైన్‌’ (కరోనా గొలుసును తుంచేయండి) పేరిట పలు మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిలో ముఖ్యమైనవి.
 
* ప్రభుత్వ(కేంద్ర, రాష్ట్ర), ప్రైవేటు కార్యాలయాలు కేవలం 15 శాతం మంది సిబ్బందితోనే పనిచేయాలి. అత్యవసర సేవలు అందించే విభాగాలు కూడా కనీస సిబ్బందితో పనిచేయాలి. ఏ సమయంలోనూ 50 శాతానికి మించి విధుల్లో ఉండకూడదు. వివాహాలకు కేవలం 25 మందికి మాత్రమే అనుమతి. ఒకేరోజు, ఒకే హాల్లో రెండు గంటలకు మించి ఈ కార్యక్రమం జరగకూడదు.
 
* ప్రైవేటు వాహనాలను(బస్సులకు మినహాయింపు) అత్యవసర సేవలకు మాత్రమే వినియోగించాలి. లేదా సరైన కారణం ఉండాలి. అదీ డ్రైవర్‌తో కలిపి వాహన సీటింగ్‌ సామర్థ్యంలో 50 శాతం మంది మాత్రమే ఉండాలి. నగరాల మధ్య, జిల్లాల మధ్య ప్రయాణించేందుకు ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదు. ఈ నిబంధనను అతిక్రమిస్తే రూ.10,000 జరిమానా.
 
* ప్రైవేటు బస్సులను 50 శాతం ఆక్సుపెన్సీతో మాత్రమే నడపాలి. ఎవరూ నిలబడి ప్రయాణించకూడదు. జిల్లాలు, నగరాల మధ్య నడిచే బస్సులు కేవలం రెండు చోట్ల మాత్రమే ఆపాలి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10,000 జరిమానా. అవసరమైతే లైసెన్స్‌ రద్దు.
 
* ప్రజా రవాణాను కేవలం ప్రభుత్వ, వైద్యారోగ్య సిబ్బంది కోసం మాత్రమే వినియోగించాలి. లేదా ఎవరికైనా వైద్య సాయం కావాలంటే వారికోసం నడపవచ్చు. వీటిలో ప్రయాణించేవారందరికీ సరైన గుర్తింపు కార్డు ఉండాలి. ప్రభుత్వ బస్సులు సైతం కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే నడవాలి. ఎవరూ నిలబడి ప్రయాణించకూడదు.