శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 ఏప్రియల్ 2021 (14:43 IST)

ప్రాణవాయువే ప్రాణం తీసింది.. ఆక్సిజన్ లీక్ కావడంతో 11మంది మృతి

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర కరోనాకు హాట్ స్పాట్‌గా మారింది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా రోగులకు తగిన సౌకర్యాలు అందట్లేదు. బెడ్లు సరిపోవట్లేదు. ఇటీవల ముంబైలో కరోనా రోగులున్న ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ప్రాణ వాయువే ప్రాణాలు తీసింది. 
 
నాసిక్‌లోని డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఆస్పత్రిలో ఆక్సీజన్ ట్యాంకర్ లీకైంది. ఈ క్రమంలో రోగులకు ఆక్సీజన్ సరఫరా నిలిచిపోయి ఐసీయూలోని 11 మంది రోగులు మరణించారు. మహారాష్ట్రలోని కరోనా ఆస్పత్రుల్లో ఆక్సీజన్ కొరత నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆక్సీజన్ ట్యాంకర్లను పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే నాసిక్‌లోని జాకీర్ ఆస్పత్రికి కూడా ట్రక్కుల ద్వారా ఆక్సీజన్ తరలించారు. వాటిని ఆస్పత్రిలోని ట్యాంకర్‌లో నింపుతుండగా ఒక్కసారిగా ఆక్సీజన్ లీకయింది. 
 
పెద్ద మొత్తంలో లీకవడంతో దట్టమై పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జాకీర్ హుస్సేన్ ఆస్పత్రిలోని 171 మంది రోగులు ఆక్సీజన్‌పై చికిత్స పొందుతున్నారు. ఐతే ట్యాంకర్ లీక్ కావడంతో ఆక్సీజన్ సరఫరా నిలిచిపోయింది. దాంతో ప్రాణ వాయువు అందక 11 మంది మరణించారు.