సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జులై 2020 (17:29 IST)

కరోనా దెబ్బకు వణికిపోతున్న ఆంధ్రా : కొత్తగా 1916 పాజిటివ్ కేసులు

కరోనా వైరస్ దెబ్బకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గజగజ వణికిపోతోంది. తాజాగా గడచిన 24 గంటల్లో కొత్తగా 1916 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 43 మంది మృత్యువాత పడ్డారు. ఒక్కరోజే ఇంతమంది మరణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
అనంతపురం జిల్లాలో 10 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు, కడప జిల్లాలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఒకరు మరణించారు. దాంతో ఇప్పటివరకు కరోనాతో మృత్యువాత పడిన వారి సంఖ్య 408కి పెరిగింది.
 
అటు, రాష్ట్రవ్యాప్తంగా మరో 1,916 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 238 కేసులు రాగా, శ్రీకాకుళం జిల్లాలో 215 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మొత్తమ్మీద పాజిటివ్ కేసుల సంఖ్య 33,019కి పెరిగింది. తాజాగా, 952 మందిని డిశ్చార్జి చేశారు. ఇంకా 15,144 మంది చికిత్స పొందుతున్నారు.