సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 జనవరి 2022 (18:26 IST)

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి - చిత్తూరులో 1,534 కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పతాక స్థాయికి చేరిందని చెప్పాలి. గత 24 గంటల్లో ఏకంగా 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఒక్క చిత్తూరు జిల్లాలోనే 1,534 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. 
 
ఇందులో గడిచిన 24 గంటల్లో 38,055 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా, ఇందులో 6,996 మందికి కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఏకంగా 1,534 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో విశాఖపట్టణం 1,263 కేసులు, గుంటూరులో 758, శ్రీకాకుళంలో 573 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఇదిలావుంటే, గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ సోకడం వల్ల నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 1,066 మంది కోలుకున్నారు. దీంతో కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,514కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,17,384 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20,66,762 మంది ఈ వైరస్ నుంచి విముక్తులయ్యారు.