కోవిడ్ 19 రోగుల కోసం ‘ఫవివిర్’ను భారత్‌లో విడుదల చేసిన హెటిరో
ప్రపంచంలోనే అత్యధికంగా వైరస్ నిరోధక ఔషధాలను తయారుచేసే ప్రముఖ ఇండియన్ జెనరిక్ ఫార్మా కంపెనీ హెటిరో ఫవిపిరవిర్ జెనరిక్ ఔషధాన్ని ప్రకటించింది. దీనిని ‘‘ఫవివిర్’ పేరుతో విక్రయిస్తుంది. ఫవిఫిరవిర్ తయారీ, మార్కెటింగ్ కోసం హెటిరోకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ) అనుమతులు ఇచ్చింది.
కోవిడ్-19 బాధితుల కోసం ఇదివరకే కోవిఫర్ (రెమ్డిసివిర్)ను హెటిరో అభివృద్ధి చేసింది. ఫవివిర్ రెండో ఔషధం. ఇది నోటి ద్వారా తీసుకునే వైరస్ నిరోధక మాత్ర. ఈ మాత్రలపై నిర్వహించిన క్లినికల్ ప్రయోగాల్లో సంతృప్తికర ఫలితాలు వచ్చాయి. స్వల్పస్థాయి నుంచి మోస్తరుస్థాయి లక్షణాలు ఉన్న కోవిడ్-19 బాధితుల చికిత్స కోసం ఈ ఔషధం ఉపయోగపడుతుంది. హెటిరో ఫవివిర్ ఒక్కో మాత్ర ధర రూ.59 ఉంటుంది. దీనిని హెటిరో హెల్త్కేర్ లిమిటెడ్ విక్రయిస్తుంది.
దేశవ్యాప్తంగా అన్ని ఔషధ దుకాణాల్లో, ఆస్పత్రుల్లో ఔషధాల దుకాణాల్లో బుధవారం నుంచే ఈ మాత్రలు అందుబాటులో ఉంటాయి. వీటిని కొనాలంటే డాక్టర్ రాసిన మందు చీటి తప్పనిసరి.
పటిష్టమైన సదుపాయాలు ఉన్న హెటిరో, ఫవివిర్ మాత్రలను ఇండియాలోనే తయారు చేస్తోంది. కఠినమైన ప్రమాణాలు, నియమాలు పాటించే యూఎస్ఎఫ్డీఏ, ఈయూ వంటి అంతర్జాతీయ నియంత్రణా ప్రాధికార సంస్థలు ఈ మందుకు అనుమతి ఇచ్చాయి.