గాలి ద్వారా కరోనా వ్యాప్తి... పాజిటివ్ రేటు.. 12 రోజుల్లో డబుల్
దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇపుడు గాలిద్వారా కూడా వ్యాపిచెందడం ఆందోళన కలిగిస్తోందని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్‌సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణ్‌దీప్ గులేరియా చెప్పుకొచ్చారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కొవిడ్ నుంచి రక్షణ కోసం ఒక ఎన్95 మాస్క్‌ను సరిగ్గా ధరిస్తే సరిపోతుందన్నారు. ఒకవేళ బట్టతో చేసిన లేదంటే సర్జికల్ మాస్కులు వాడుతుంటే.. రెండు పెట్టుకోవాలని సూచించారు. ఈ మాస్కులు కూడా ఖచ్చితంగా మీ నోరు, ముక్కును పూర్తిగా కవర్ చేసేలా చూసుకోవాలన్నారు.
గాలి ద్వారా కొవిడ్ ఆందోళనకరమన్న ఆయన.. ఇళ్లలో వెంటిలేషన్ అనేది చాలా ముఖ్యమన్నారు. కొవిడ్ నిబంధనలను సరిగా పాటించకపోవడం, వైరస్ మ్యుటేషన్ అనేవి దేశంలో కేసులు ఈ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడిన విషయం తెలిసిందే.
మరోవైపు, దేశంలో కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాపిస్తున్నది. రోజువారీ పాజిటివ్ కేసులు 12 రోజుల్లో డబుల్ అవుతున్నాయి. 8 శాతంగా ఉన్న పాజిటివ్ రేటు 16.69 శాతానికి పెరిగింది. అలాగే గత నెలలో వారాంత పాజిటివిటి రేటు కూడా 3.05 శాతం నుంచి 13.54 శాతానికి పెరిగింది.
ఛత్తీస్‌గఢ్‌లో అత్యధికంగా వీక్లీ పాజిటివిటి రేటు 30.38 శాతంగా ఉన్నది. 24.24 శాతంతో గోవా, 24.17 శాతంతో మహారాష్ట్ర, 23.33 శాతంతో రాజస్థాన్, 18.99 శాతంతో మధ్యప్రదేశ్ తర్వాత స్థానాల్లో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.