నార్వే: ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్న 23 మంది వృద్ధుల మృతి
కోవిడ్-19 ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న 23మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. కరోనా టీకాలు వేయించుకున్న 23 మంది అనారోగ్యానికి గురై మరణించడంతో నార్వే అధికారులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.
80 ఏళ్ల వయసు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ అందిస్తే వారిలో ప్రతికూల చర్యలు కనిపించాయని వైద్యులు చెప్పారు. 23 మంది వృద్ధులు కరోనా టీకా వేయించుకున్న కొద్దిసేపటికే మరణించారని, దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నామని నార్వే వైద్యులు చెప్పారు. ఫైజర్ వ్యాక్సిన్ వల్లనే మరణాలు సంభవించాయని ఇంకా తేలలేదని, మరణించిన 23 మందిలో 13 మంది విరేచనాలు, వికారం, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయని వైద్యులు చెప్పారు.
నార్వేలో టీకా మరణాలతో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఐరోపాలో టీకా సరఫరాను తాత్కాలికంగా తగ్గించారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు టీకాలు వేయకుండా ఉండాలని నార్వేజియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఇప్పుడు హెచ్చరిక జారీ చేసింది. తక్కువ ఆయుష్షు ఉన్నవారికి టీకా వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని బ్లూమ్ బెర్డ్ నివేదించింది.
నార్వేలో డిసెంబరు చివరి నుంచి ఇప్పటివరకు 30,000 మందికి ఫైజర్, మోడెర్నా కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. 21 మంది మహిళలు, 8 మంది పురుషులు టీకా వల్ల దుష్ప్రభావాలు వచ్చాయని నార్వే మెడిసిన్ ఏజెన్సీ తన నివేదికలో తెలిపింది. నార్వేలో 9 మందికి అలర్జీతోపాటు టీకా వేసిన చోట తీవ్రమైన నొప్పి ఉందని నార్వే వైద్యులు చెప్పారు.