కొత్త మ్యుటేంట్లతో థర్డ్‌వేవ్ ముప్పు?
దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన బీభత్సంతో భారత్ చిగురుటాకులా వణికిపోయింది. ఒక దశలో రోజూవారీ కేసులు దాదాపుగా 4 లక్షల చేరువకు వచ్చాయి. దీంతో పాలకులతో పాటు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, గతకొద్ది రోజులుగా రోజూవారీ కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ, కరోనా థర్డ్‌వేవ్ (మూడోదశ ఉద్ధృతి) రాబోతున్నదన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
కానీ, ఈ మూడోదశ విజృంభణపై పలువురు నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. థర్డ్‌వేవ్ ఖచ్చితంగా వస్తుందని కొందరు చెబుతుండగా, వచ్చే అవకాశంలేదని మరికొందరు పేర్కొంటున్నారు. అయితే కేంద్రప్రభుత్వానికి ప్రధాన శాస్త్ర సలహాదారుడిగా వ్యవహరిస్తున్న కె.విజయ్ రాఘవన్ మాత్రం దేశంలో మూడోవేవ్ ముప్పు అనివార్యమన్నారు.
కరోనా మూల వైరస్ ఉత్పరివర్తనాలు చెందిన తర్వాత ఏర్పడిన బీ.1.617.2 వేరియంట్ (డెల్టా) కారణంగా దేశంలో సెకండ్‌వేవ్ ఉద్ధృతి మొదలైందన్నారు. అలాగే, వైరస్ మరోసారి ఉత్పరివర్తనం చెందితే థర్డ్‌వేవ్ వచ్చే ప్రమాదం ఉన్నదన్నారు. కొవిడ్-19 నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉండొచ్చని హెచ్చరించారు.
మరోవైపు, వచ్చే ఫిబ్రవరి - ఏప్రిల్ మధ్యలో దేశంలో మూడో వేవ్ రావొచ్చని భారత శాస్త్ర, సాంకేతిక విభాగం(డీఎస్‌టీ) కరోనాపై ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందంలో ఒకరు, కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు. అయితే, మూడోవేవ్ రావడానికి గల కారణాలను మరింత లోతుగా విశ్లేషించాలన్నారు. ఇంకోవైపు, ఫస్ట్‌వేవ్ లాగానే సెకండ్ వేవ్ కూడా అంతే తీవ్రంగా ఉండొచ్చని ఎస్బీఐ నిపుణుల నివేదిక అంచనా వేసింది. ఇది దాదాపుగా 98 రోజుల పాటు కొనసాగవచ్చని పేర్కొన్నారు.