శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 24 నవంబరు 2016 (11:03 IST)

కోహ్లీ ఆ పని చేశాడా..? బ్రిటన్ మీడియాపై సెహ్వాగ్ విసుర్లు.. ఓడిపోతే హుందాగా అంగీకరించాలి

ఇంగ్లండ్ మీడియాపై మాజీ క్రికెటర్‌, నజబ్‌గఢ్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఫైర్ అయ్యాడు. టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడంటూ బ్రిటీష్‌ మీడియా కథనాలు రావడంపై సెహ్వాగ్ ఘాటు

ఇంగ్లండ్ మీడియాపై మాజీ క్రికెటర్‌, నజబ్‌గఢ్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఫైర్ అయ్యాడు. టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడంటూ బ్రిటీష్‌ మీడియా కథనాలు రావడంపై సెహ్వాగ్ ఘాటుగా స్పందించాడు. ఇలాంటి అర్థంలేని ఆరోపణలు చేయడం కన్నా విశాటపట్నంలో జరిగిన రెండో టెస్టులో ఓటమిని ఇంగ్లండ్‌ గౌరవప్రదంగా అంగీకరించి ఉంటే.. ఆ జట్టు గౌరవం పెరిగేదని వ్యాఖ్యానించాడు.
 
ఓడిపోయే జట్టు ఎప్పుడూ కొన్ని అంశాలు లేవనెత్తి లబ్ధి పొందాలని చూస్తుందని సెహ్వాగ్ ధ్వజమెత్తాడు. రాజ్‌కోట్‌లో మొదటి టెస్టు సందర్భంగా విరాట్‌ కోహ్లి బాల్‌ను ట్యాంపర్‌ చేస్తున్నట్టు ఓ వీడియో సోషల్‌ మీడియాలో వెలుగుచూసింది. చూయింగమ్‌ నములుతూ ఉన్న కోహ్లి తన లాలాజలాన్ని బాల్‌కు రుద్ది.. అది మెరిసేలా చేశాడని, ఇది బాల్‌ ట్యాంపరింగ్‌యేనని ఆరోపిస్తూ బ్రిటన్‌ మీడియా కథనాలు రాసింది. 
 
దీనిపై సెహ్వాగ్ స్పందిస్తూ.. ఇంగ్లండ్‌ జట్టు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కానీ ఆ దేశ మీడియానే ఇలాంటి రాతలు రాస్తున్నది. ఓటమిని కూడా గౌరవప్రదంగా అంగీకరించాలని హితవు పలికాడు. విదేశాల్లో ఓడిపోయినప్పుడు మేం ఎప్పుడూ సాకులు చెప్పలేదని సెహ్వాగ్ గుర్తు చేశాడు. తాము విదేశీ గడ్డపై  ఓడిపోతే హుందాగా మా ఆటతీరు మెరుగ్గా లేకపోవడం వల్లే ఓడిపోయామని అంగీకరించినట్లు సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.