గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 జనవరి 2021 (07:59 IST)

గబ్బా విజయం.. ఏ ఒక్కరిదో కాదు.. సమిష్టి విజయం : అజింక్యా రహానే

ఆస్ట్రేలియా కంచుకోటగా ఉన్న గబ్బా క్రికెట్ స్టేడియంలో భారత క్రికెట్ జట్టు సాధించిన విజయం ఏ ఒక్కరి వల్లో వచ్చిందని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ అజింక్యా రహానే వ్యాఖ్యానించారు. ఆసీస్ పర్యటనలో భారత కుర్రోళ్లు టెస్ట్ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. 
 
ముఖ్యంగా భారత్‌కు ఏమాత్రం అచ్చిరాని గబ్బా క్రికెట్ స్టేడియంలో భారత కుర్రోళ్లు వీరవిహారం చేసి విజయభేరీ మోగించారు. ఈ విజయాన్ని ప్రతి కొనియాడుతున్నారు. ఈ క్రమంలో గబ్బా గెలుపు తర్వాత డ్రస్సింగ్ రూములో సహచర క్రికెటర్లను ఉద్దేశించి రహానే మాట్లాడాడు. ఆ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో విడుదల చేసింది.
 
'ఇవి మనకు అద్భుతమైన క్షణాలు. అడిలైడ్‌లో ఏం జరిగింది? మెల్‌బోర్న్‌కు వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. ఇది నిజంగా చాలా అద్భుతం. ఈ విజయం వెనుక ప్రతి ఒక్కరి కృషి, పట్టుదలా ఉన్నాయి. ఇది ఎవరో ఒకరో, ఇద్దరో ఆటతీరు వల్ల దక్కిన విజయం కాదు" అని అన్నాడు. 
 
ఆపై ఈ టెస్ట్ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం దక్కించుకోలేకపోయిన కుల్ దీప్ యాదవ్ పేరును ప్రస్తావిస్తూ, అతను మరింతగా శ్రమిస్తుండాలని, ఏదో ఒక రోజు అతని సమయం వచ్చి తీరుతుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాడు.
 
కుల్దీప్‌తో పాటు కార్తీక్ త్యాగి పేరును ప్రస్తావిస్తూ, వీరిద్దరూ తమ సత్తాను చాటాలని ఎంతో ఆశతో ఉన్నారని, వారిద్దరి ఆటతీరు తనకు ప్రత్యక్షంగా తెలుసునని చెప్పిన రహానే, ఇద్దరికీ సమీప భవిష్యత్తులోనే టీమిండియాకు ఆడే అవకాశం లభిస్తుందని అన్నాడు. రహానే మాట్లాడుతున్న సమయంలో పక్కనే కోచ్ రవిశాస్త్రితో పాటు జట్టు మేనేజ్ మెంట్ సభ్యులు కూడా ఉన్నారు. బీసీసీఐ షేర్ చేసిన ఈ వీడియోను మీరూ చూడవచ్చు.