బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2019 (12:31 IST)

అలా... 96 యేళ్ళ తర్వాత ఇంగ్లండ్ విజయం..

ఇంగ్లండ్ వేదికగా యాషెస్ టెస్ట్ సిరీస్ సాగుతోంది. ఇందులోభాగంగా, లీడ్స్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు విజయభేరీ మోగించింది. ఆ జట్టు ఆటగాడు బెన్ స్టోక్స్ వీరోచిత ఇన్నింగ్స్ పుణ్యమాని ఇంగ్లండ్ జట్టు ఒక్క వికెట్ తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. పైగా, ఒక్క వికెట్ తేడాతో ఇంగ్లండ్ గెలవడం 96 యేళ్ళ తర్వాత ఇది తొలిసారి కావడం గమనార్హం. 
 
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ ముంగిట 359 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ ఇంకా వికెట్‌ మిగిలి ఉండగా ఛేదించింది. బెన్‌ స్టోక్స్‌ వీరోచిత బ్యాటింగ్ పుణ్యమాని 219 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 135 (నాటౌట్) పరుగులు చేసి జట్టును గెలిపించాడు. 
 
నిజానికి 286 వద్ద 9వ వికెట్‌ పడిన దశలో మరో 73 పరుగులు చేయాల్సిన తరుణంలో స్టోక్స్‌ సమయోచితంగా బ్యాటింగ్‌ చేశాడు. 11వ నంబరు బ్యాట్స్‌మన్‌ జాక్‌ లీచ్‌ (17 బంతుల్లో 1 నాటౌట్‌)ను కాపాడుకుంటూ స్టోక్స్‌ చెలరేగి జట్టును గెలుపు బాట పట్టించాడు.
 
ఇకపోతే, ఇంగ్లండ్ జట్టు ఆ జట్టు క్రికెట్ చరిత్రలో ఒక్క వికెట్ తేడాతో గెలవడం ఇది నాలుగోసారి. 1902లో ఆసీస్‌తో ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి వికెట్‌ తేడాతో గెలిచిన ఆసీస్‌..  1907-08 సీజన్‌లో మెల్‌బోర్న్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్‌ తేడాతో విజయం సాధించింది. 
 
ఆపై 1922-23 సీజన్‌లో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో చివరిసారి వికెట్‌ తేడాతో గెలిచిన ఇంగ్లండ్‌.. ఆపై ఇంతకాలానికి వికెట్‌ తేడాతో గెలుపును ఖాతాలో వేసుకుంది. 96 ఏళ్ల తర్వాత వికెట్‌ తేడాతో టెస్టు మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ సొంతం చేసుకుంది.
 
కాగా,  ఆసీస్‌తో జరిగిన తాజా యాషెస్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకుంది. ఇది ఇంగ్లండ్‌కు అత్యధిక ఛేజింగ్‌ రికార్డుగా నిలిచింది. 1928-29 సీజన్‌లో ఆసీస్‌తో 332 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్‌ ఛేదించిన అత్యధిక పరుగుల రికార్డు ఇప్పటివరకూ ఉండగా, దాన్ని ఇప్పుడు ఇంగ్లండ్‌ బ్రేక్‌ చేసింది. 
 
ఇక ఛేజింగ్‌ పరంగా చూస్తే 10 వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన రెండో జోడిగా బెన్‌ స్టోక్స్‌-జాక్‌ లీచ్‌లు నిలిచారు. 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జోడి కుశాల్‌ పెరీరా-విశ్వ ఫెర్నాండోలు 10వ వికెట్‌కు అజేయంగా 78 పరుగులు సాధించింది. అది ఇప్పటికీ తొలి స్థానంలో ఉండగా, స్టోక్స్‌-లీచ్‌ల రికార్డు రెండో స్థానాన్ని ఆక్రమించింది.