గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 11 జులై 2017 (15:58 IST)

నిరుద్యోగులుగా మారిన ఆస్ట్రేలియన్ క్రికెటర్లు.. ఉద్యోగాల కోసం దరఖాస్తు

ఆస్ట్రేలియాలో ఉన్న నిరుద్యోగుల్లో ఆ దేశ క్రికెటర్లు కూడా చేరిపోయారు. దీంతో ఉపాధి కోసం ప్రతి కంపెనీకి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎవరైనా ఉపాధి కల్పించాలంటూ వారు ప్రాధేయపడుతున్నారు. వినేందుకు ఈ వార్త వింత

ఆస్ట్రేలియాలో ఉన్న నిరుద్యోగుల్లో ఆ దేశ క్రికెటర్లు కూడా చేరిపోయారు. దీంతో ఉపాధి కోసం ప్రతి కంపెనీకి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎవరైనా ఉపాధి కల్పించాలంటూ వారు ప్రాధేయపడుతున్నారు. వినేందుకు ఈ వార్త వింతగా ఉన్నప్పటికీ ఇది నిజం. 
 
ఆస్ట్రేలియా క్రికెటర్లు, క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డుకు మధ్య జీతాల వివాదం కొనసాగుతోంది. ఆదాయంలో వాటా విధానానికి స్వ‌స్తి చెప్పి బోర్డు కొత్త జీతాల ప‌ద్ధ‌తిని ప్ర‌వేశ‌పెట్ట‌డాన్ని ప్లేయ‌ర్స్ తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఈ సమస్య పరిష్కారం కోసం చర్చలు జరిపినప్పటికీ.. ఫలితం లేకపోయింది. దీనికితోడు.. బోర్డుతో క్రికెటర్లకు ఉన్న కాంట్రాక్టు కాలపరిమితి గత నెల 30వ తేదీతోనే ముగిసింది. దీంతో వారు క్రికెట్‌కు దూరమయ్యారు.
 
వాస్తవానికి పాత కాంట్రాక్టు అమల్లో ఉండగానే కొత్త కాంట్రాక్టు పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంది. ఈ కొత్త కాంట్రాక్టు జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. కానీ, సమస్య పరిష్కారం కాకపోవడంతో కొత్త కాంట్రాక్టులు కుదుర్చుకోలేదు. అదేసమయంలో బోర్డు ప్రతిపాదించిన కొత్త విధానానికి అనుకూలంగా వారు సంతకాలు చేయక పోవడంతో క్రికెటర్లకు జీతాలు ఇవ్వ‌డం లేదు. 
 
ఇక చేసేది లేక వేరే ఆదాయ మార్గాలు చూసుకుంటున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా వ‌ల్లే ప్లేయ‌ర్స్‌కు ఈ ప‌రిస్థితి త‌లెత్తింద‌ని ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్స్ అసోసియేష‌న్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ టిమ్ క్రూయిక్‌షాంక్ అన్నారు. ప్లేయ‌ర్స్‌కు జీతాలు చెల్లించ‌డం లేదు.. చెల్లించ‌బోమ‌ని కూడా క్రికెట్ ఆస్ట్రేలియా తేల్చి చెప్పింది. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో వేరే మార్గాలు చూసుకోవాల్సి వ‌స్తున్న‌ది అని ఆయ‌న తెలిపారు. కాగా, క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఆదాయంలో ఎక్కువ భాగాన్ని కింది స్థాయిలో క్రికెట్ అభివృద్ధికి కేటాయించాల‌ని భావిస్తున్న‌ది. 
 
అయితే, క్రికెట్ బోర్డుల‌తో జీతాల వివాదం చెలరేగడం ఇదేం కొత్తకాదు. 1970ల్లో ఇదే ఆస్ట్రేలియా టీమ్ ప్లేయ‌ర్స్ బోర్డుతో ప‌డ‌క‌.. రెబ‌ల్ వ‌ర‌ల్డ్ సిరీస్ క్రికెట్‌లో చేరిన విష‌యం తెలిసిందే. ఇపుడు కూడా బోర్డు, క్రికెటర్లు ఏమాత్రం వెనక్కి తగ్గగ పోవడంతో ఇప్పటికే దక్షిణాఫ్రికా ప్రయటనను ఆస్ట్రేలియా 'ఎ' జట్టు రద్దు చేసుకుంది. అలాగే, సీనియ‌ర్ టీమ్ ఇండియా, సౌతాఫ్రికా టూర్ల‌తోపాటు యాషెస్ సిరీస్ జ‌ర‌గ‌డం కూడా ఇప్పుడు అనుమానంగా మారింది.