బంగ్లాదేశ్ క్రికెటర్‌కు బ్రెయిన్ ట్యూమర్ (Video)
బంగ్లాదేశ్ క్రికెటర్ ముషారఫ్ హుస్సేన్ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఇటీవల అనారోగ్యానికి గురైన ముషారఫ్.. ఢాకాలోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు.. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఇది ప్రారంభ దశలోనే ఉందని చెప్పారు. ఇది సర్జరీతో నయమవుతుందని చెప్పారు. దీంతో అతను సింగపూర్‌కు వెళ్లి సర్జరీ చేయించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు.
ఇందుకోసం ఆయన క్రికెట్ బోర్డు అనుమతి తీసుకుని వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. ఇది పూర్తయిన వెంటనే సింగపూర్ విమానం ఎక్కనున్నాడు. ముషారఫ్ హుస్సేన్ సర్జరీకి దాదాపు రూ. 40 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు వెల్లడించారు.
కాగా, ఈ బ్రెయిన్ ట్యూమర్‌పై ముషారఫ్ స్పందిస్తూ, 'నాకు సర్జరీ అవసరం. దీని కోసం సింగపూర్ వెళ్తున్నాను. ప్రస్తుతం వీసాకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. అది పూర్తయిన వెంటనే సింగపూర్ వెళ్తాను. నాకు ట్యూమర్ ఉన్నట్లు తెలిసిన వెంటనే నేను, నా కుటుంబం కృంగిపోయాం. అయితే, ఇది ప్రారంభ దశలోనే ఉందని తెలియగానే మాకు కొంత ఉపశమనం కలిగింది. నా ఆరోగ్య పరిస్థితి గురించి బంగ్లా క్రికెట్ బోర్డుకు చెప్పాను. అందరూ నన్ను ఆందోళన చెందొద్దని చెబుతున్నారు. నేను కూడా ధైర్యంగా ఉండడానికే ప్రయత్నిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చారు.