బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 జనవరి 2020 (17:05 IST)

ధోనీ రనౌట్.. మహీపై గవాస్కర్ ఫైర్.. డైవ్ చేసివుంటే బాగుండు..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ప్రపంచకప్‌ రనౌట్‌పై స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో ధోనీ మాట్లాడుతూ.. ప్రపంచ కప్‌లో రనౌట్ అయిన తర్వాత చాలా బాధపడ్డాను. తాను ఆడిన తొలి మ్యాచ్‌లో కూడా రనౌట్ అయ్యాను. మళ్లీ సెమీఫైనల్లో కూడా రనౌట్ అయ్యాను. ఈ రెండు రనౌట్‌లపై ఇప్పటికీ బాధపడుతూనే వున్నానని చెప్పుకొచ్చాడు. ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఎందుకు డైవ్ చేయలేకపోయానని తనను తాను ప్రశ్నించుకుంటానని వెల్లడించాడు. ఆ రెండు ఇంచులను డైవ్ చేయాల్సిందని ధోనీ తెలిపాడు.
 
గతేడాది ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌-20019లో టీమిండియా సెమీస్‌ నుంచే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. టోర్నీ ఆసాంతం వరుస విజయాలతో దూసుకుపోయి కివీస్‌తో జరిగిన సెమీఫైనల్లో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సెమీస్‌లో మాజీ కెప్టెన్‌ ధోనీ అనూహ్యంగా రనౌట్ కావడంతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో ప్రపంచ కప్పుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత్ భారంగా ఇంటిముఖం పట్టింది.
 
గతేడాది జూలై 10న సెమీస్ మ్యాచ్ ముగిశాకా దాదాపు ఆరు నెలలుగా ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. మెగా టోర్నీ ముగిసిన తర్వాత కొంతకాలం పాటు భారత సైన్యంలో సేవలందించాడు. అనంతరం వెస్టిండీస్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంకల సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌కూ ధోనీ అందుబాటులో లేడు. ఇక న్యూజిలాండ్ పర్యటనకు దూరం కానున్నాడు.
 
తాజాగా భారత హెడ్ కోచ్ రవి శాస్త్రి మాట్లాడుతూ... ''ధోనీ త్వరలోనే వన్డే కెరీర్‌కు వీడ్కోలు పలుకనున్నాడు. టీ20లలో మాత్రమే కొనసాగుతాడని తెలిపాడు. ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేసి.. ఫిట్‌నెస్, ఫామ్ బాగుంటే టీ20 ప్రపంచకప్‌కు ధోనీ ఎంపికయ్యే అవకాశాలున్నాయి" అని తెలిపాడు.
 
మరోవైపు మాజీ కెప్టెన్ ధోనీ సుదీర్ఘ విశ్రాంతి తీసుకోవడంపై క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ ఫైర్ అవుతున్నాడు. ఇంత సుదీర్ఘ కాలం స్వయంగా జాతీయ జట్టుకు ఎవరైనా దూరంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఒకవేళ టీ20 ప్రపంచకప్‌ జట్టులో ధోనీ ఉండాలనుకుంటే.. అతడి ఫిట్‌నెస్‌ గురించి ఎవరేం చెప్పలేరు. ఆ విషయాన్ని ధోనీ తనకు తాను ప్రశ్నించుకోవాలి. 
 
గతేడాది జూలై జరిగిన వన్డే ప్రపంచకప్ నుంచి ధోనీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కావాలని జాతీయ జట్టుకు ఇంత కాలం ఎవరైనా దూరమయ్యారా? ఇప్పుడిదే ప్రశ్న అందరి మదిలో ఉందని గవాస్కర్ వ్యాఖ్యానించారు. దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో పాల్గొనే ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులు పెంచకపోతే.. ఐపీఎల్‌ వెలుగులో రంజీ ప్రభ మసకబారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.