మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 30 జనవరి 2017 (00:42 IST)

నాలుగు ఓవర్లు ఉండగానే మనం గెలుస్తున్నామని బుమ్రాతో చెప్పా: ఆశిష్ నెహ్రా

డెత్ ఓవర్లలో బౌలర్‌కు ఆత్మవిశ్వాసం ముఖ్యం, బుమ్రా అక్కడే గెలుపొందడంటున్న ఆశీష్ నెహ్రా

ఇంగ్లండ్ లక్ష్యఛేదనలో దూకుడు చూపిస్తున్నప్పటికీ చివరివరకు గెలుపు విషయంలో తనకెలాంటి సందేహం లేదని భారత క్రికెట్ జట్టు సీనియర్ బౌలర్ ఆశిష్ నెహ్రా తెలిపారు. నాలుగు ఓవర్లలో 32  పరుగుల లక్ష్యంతో ఇంగ్లండ్ విజృంభిస్తున్నప్పటికీ రెండో టీ-20 ఆటలో మనమే గెలువబోతున్నామని బుమ్రాతో చెప్పానంటున్న నెహ్రా తీవ్రమైన ఒత్తిడితో సాగుతున్న గేమ్‌లో బుమ్రా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన ఇదేమీ తొలిసారి కాదని తెలిపాడు. ఇంగ్లండును నిలవరించడానికి బుమ్రాను స్వేచ్ఛగా బౌలింగ్ చేయనివ్వాలని తాను కోరుకున్నానని రెండో టీ-20లో అతని నైపుణ్యానికి నిజంగా అభినందనలు తెలుపుతున్నానని నెహ్రా ప్రశంసించాడు. 
 
డెత్ ఓవర్లలో అద్వితీయ బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించడం బుమ్రాకు ఇది తొలిసారేమీ కాదని నెహ్రా చెప్పాడు. లెంగ్త్ బాల్స్ వేయొచ్చా అని చివరి ఓవర్‌కు ముందు బుమ్రా తనను అడిగాడని, నీవు మంచి యార్కర్లు వేయగలవు. ఫుల్ బాల్స్ వేయడానికి ప్రయత్నించు, ఈ దశలో లో ఫుల్ టాస్ బంతి సంధించినా బ్యాట్స్‌మన్ దాన్ని సిక్స్‌గా మలచడం చాలా కష్టమని చెప్పాను. సరిగ్గా అది పనిచేసింది. నాలుగు ఓవర్లలో 32 పరుగులు ఇంగ్లండ్ చేయవలసి వచ్చినప్పుడే మనం గెలువబోతున్నామని బుమ్రాతో చెప్పాను అని నెహ్రా తెలిపాడు.
 
చివరి ఓవర్లలో బౌలింగ్ చేయవలసి వచ్చినప్పుడు ఓ బౌలర్‌కైనా తనపై తనకు నమ్మకం ఉండాలని, బుమ్రా తనపై తాను విశ్వాసం ఉంచుకోవడమే ఈ అద్బుత గెలుపుకు కారణమని నెహ్రా విశ్లేషించాడు.
 
రెండో టీ-20  మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 5 బంతుల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించిన టీమిండియా 3 మ్యాచ్‌ల సీరీస్‌ను 1-1 తో సమానం చేసింది. ఫిబ్రవరి 1న బెంగళూరులో జరుగనున్న మూడో టీ-20 సీరీస్ విజేతను తేల్చనుంది.