శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Updated :hyderabad , బుధవారం, 18 జనవరి 2017 (15:46 IST)

కోహ్లీ ఎలా ఆడతాడో చూస్తాడట ఈ బౌలర్

పుణేలో జరిగిన తొలి వన్డేలో కోహ్లీకంటే వేగంగా వీరబాదుడుతో తమకు చుక్కలు చూపెట్టిన మరో భారత బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్‌ను కూడా పక్కనబెట్టిన ఇంగ్లండ్ జట్టు రెండో వన్డేలో కోహ్లీకి చెక్ పెడతామని తేల్చి చెబుత

భారత్‌తో తొలి వన్డేలో ఘోర పరాజయం పొందిన ఇంగ్లండ్ జట్టుకు కల్లో కూడా కోహ్లీ గుర్తుకొస్తున్నట్లున్నాడు. పుణేలో జరిగిన తొలి వన్డేలో కోహ్లీకంటే వేగంగా వీరబాదుడుతో తమకు చుక్కలు చూపెట్టిన మరో భారత బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్‌ను కూడా పక్కనబెట్టిన ఇంగ్లండ్ జట్టు రెండో వన్డేలో కోహ్లీకి చెక్ పెడతామని తేల్చి చెబుతోంది. కారణం తెలిసిందే. కోహ్లీ ఒక్కడు నిలబడితే చాలు జట్టు జట్టంతా అతడికి తోడై నిలిచి ఆడుతుందనేది రుజువైపోయింది. 
 
తొలివన్డేలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’  హీరో కేదార్‌ జాదవ్‌ (76 బంతుల్లో 120; 12 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి (105 బంతుల్లో 122; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్బుత శతకాలతో భారత్ అసాధారణ రీతిలో ఇంగ్లండ్‌పై విజయాన్ని సాధించింది. అయితే రెండో వన్డేలో భారత బ్యాట్స్‌మన్లకు అలాంటి అవకాశం ఇవ్వనని ఇంగ్లండ్ పేసర్ జేక్ బాల్ అంటున్నాడు. గురువారం కటక్‌లో ఇరుజట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. టీమిండియా కెప్టెన్ కోహ్లీని పరుగులు చేయకుండా అడ్డుకుంటే తమ విజయం నల్లేరుపై నడకేనని చెప్పాడు.
 
సాధ్యమైనంత వరకు కోహ్లీని క్రీజులో కుదురుకోనీయకుండా అతడికి ముకుతాడు వేస్తామని, ఇందుకు షార్ట్ పిచ్ బంతులను మార్గం ఎంచుకుంటామని పేసర్ జేక్ బాల్ తెలిపాడు. కోహ్లీని ఔట్ చేయడానికి తమ వద్ద మరిన్ని ఎత్తులతో తాము సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. పుణే వన్డేలో 3/67తో రాణించిన ఈ పేసర్.. కోహ్లీలాంటి అత్యుత్తమ ఆటగాడిని త్వరగా పెవిలియన్ బాట పట్టించాలని, లేకపోతే తమ జట్టు మరోసారి మూల్యం చెల్లించుకోక తప్పదని అభిప్రాయపడ్డాడు. ఇటీవల టెస్ట్ సిరీస్‌లో కోహ్లీ ఆటను చూశాను.. ఇప్పుడు వన్డేల్లోనూ కోహ్లీ కుమ్మేస్తున్నాడని  ప్రశంసించాడు.  
 
మొత్తం మీద కోహ్లీ భూతం ఇంగ్లండ్‌ జట్టును నిద్రలోనూ వెంటాడుతున్నట్లుంది.