చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్
హైదరాబాద్ నగరంలో చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళా రోగిపట్ల వార్డుబాయి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన విద్యా నగర్‌లోని మహిళా సభ ఆస్పత్రిలో జరిగింది. చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చన మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో భయాందోళనకు గురైన ఆ మహిళ బిగ్గరగా కేకలు వేసింది.
ఆమె అరుపులతో వార్డులోని ఇతర రోగులతో పాటు ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత వారంతా కలిసి వార్డు బాయిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
లైంగిక ఆరోపణలు - అధ్యాపకుడిపై ఫిర్యాదు... వేధింపులు భరించలేక విద్యార్థిని....
ఒరిస్సా రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. రాష్ట్రంలోని బాలాసోర్‌లోని ఒక కాలేజీలో ఓ అధ్యాపకుడుపై ఓ విద్యార్థిని ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. వీటిని భరించలేక ఆ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడనే ఆరోపణలతో ఓ అధ్యాపకుడిపై ఓ విద్యార్థిని ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. వీటిని భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఆమె 95 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెను కాపాడబోయిన మరో విద్యార్థికి కూడా 70 శాతం కాలిన గాయాలయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆ అధ్యాపకుడిని అరెస్టు చేశారు. ఉన్నత విద్యాశాఖ కళాశాల ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్యని సూరజ్ హామీ ఇచ్చారు. ఫకీర్ మోహన్ కళాశాలలో చదువుతున్న బాధిత విద్యార్థిని జులై 1న కళాశాల అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేసింది.
తన విభాగాధిపతి సమీర్ కుమార్ తనను వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. వారం రోజుల్లో అతనిపై చర్యలు తీసుకుంటామని విద్యార్థినికి హామీ ఇచ్చినప్పటికీ, అది జరగలేదని తెలుస్తోంది. అధ్యాపకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మనస్తాపం చెందిన బాధిత విద్యార్థిని, ఇతర విద్యార్థులతో కలిసి కళాశాల గేటు వెలుపల నిరసనకు దిగింది. ఆ సమయంలో విద్యార్థిని ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ ప్రిన్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లి, తనపై తాను పెట్రోలు పోసుకొని నిప్పంటించుకుంది.
మంటలు అంటుకున్న తర్వాత ఆమె కారిడార్లో పరుగెత్తుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఒక విద్యార్థి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా, అతని టీషర్టుకు కూడా మంటలు అంటుకున్నాయి.
ఈ ఘటనపై ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్ స్పందిస్తూ, విద్యార్థిని ఫిర్యాదు చేసిందని, అంతర్గత కమిటీ నివేదికను సమర్పించే పనిలో ఉందని చెప్పారు. బాధిత విద్యార్థిని తనను కార్యాలయంలో కలిసిందని, ఆ అధ్యాపకుడి వల్ల తాను పడిన వేదనను తెలిపిందని, ఆ వెంటనే అతడిని తన కార్యాలయానికి పిలిచి విచారించానని ఆయన తెలిపారు.